గాలీవాన బీభత్సం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:25 AM
Downed electrical transformers and poles జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకూ ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. 3.30 గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని.. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.
నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు
రహదారులపై కూలిన చెట్లు
పలు గ్రామాల్లో అంధకారం
జీడి, మామిడి, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం
శ్రీకాకుళం/ జి.సిగడాం, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకూ ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. 3.30 గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని.. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఎచ్చెర్లలో అత్యధికంగా 52.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చే దశలో మామిడి, జీడిమామిడి కాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి. పలుచోట్ల మొక్కజొన్నతోపాటు అరటి తోటలు సైతం నేలమట్టమయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జి.సిగడాం మండల కేంద్రంతోపాటు మెట్టవలస, కొయ్యానపేట, నక్కపేట గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. సంతవురిటి- పాలఖండ్యాం మధ్య రోడ్డుపై చెట్టు కూలింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరోవైపు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళంలో కూడా సుమారు మూడున్నర గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణలో జాప్యంతో పలు గ్రామాలు మరికొన్ని గంటల పాటు అంధకారంలోనే మగ్గిపోయాయి. ఎచ్చెర్ల అంధకారంలో అలముకుంది. సాయంత్రం 4.30 నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఇంటిపై పిడుగు..
జి.సిగడాంలోని రజకవీధికి చెందిన కురిటి భూలోక ఇంటి ఆవరణలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగుధాటికి ఇంటిపైన ఉన్న రేకులషెడ్ పైకప్పు శిథిలమైంది. టీవీ, ఫ్రిజ్‌తోపాటు విద్యుత్ పరికరాలు పాడయ్యాయి. ఆ సమయంలో భూలోక కుటుంబ సభ్యులు కింద ఇంట్లో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వీఆర్వో సీతయ్య, ఏఆర్‌ఏ వినోద్‌కుమార్ ఆ ఇంటిని పరిశీలించి.. వివరాలు సేకరించారు.
రైతుకి గాయాలు
జి.సిగడాం మండలం నక్కపేట గ్రామానికి చెందిన లెంక సత్యం.. గాలీవాన దెబ్బకు దొరికి గాయాలు పాలయ్యాడు. సోమవారం మధ్యాహ్నం మొక్కజొన్న పంట కండెలు తెచ్చేందుకు పొలానికి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతకు రోడ్డుపై పడిపోయాడు. కాలు విరిగి.. తీవ్రంగా గాయపడిన ఆయన్ను రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
సోమవారం నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో) :
================
ఎచ్చెర్ల 52.5
రణస్థలం 26.25
లావేరు 21.0
జి.సిగడాం 19.25
శ్రీకాకుళం 16.5
ఆమదాలవలస 5.5
పిడుగుపాటుకు గురై యువకుడి మృతి
మెళియాపుట్టి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి సరదాగా మహేంద్రగిరుల వద్దకు వెళ్లిన ఆ యువకుడిపై పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. మెళియాపుట్టి మండలం రట్టిణి గ్రామానికి చెందిన వినోద్‌జిన్నా(40) సోమవారం పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈయన కొన్నేళ్ల నుంచి కుటుంబంతో సహా కటక్‌లో జీవనం సాగిస్తున్నారు. సోమవారం స్నేహితులతో కలిసి సరదాగా ఒడిశాలోని మహేంద్రగిరుల వద్దకు వెళ్లారు. సాయంత్రం సమయంలో భారీ ఈదురుగాలులతోపాటు వర్షం కురవడంతో తోటి స్నేహితులు భీముని గుడిలో ఉండిపోయారు. వినోద్‌జిన్నా కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో పిడుగుపడి మృతి చెందాడు. ఈయనకు భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారంతా బోరున విలపించారు. ఈ ఘటనపై పర్లాఖిముడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్‌జిన్నా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాఖిముడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రట్టిణి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.