యోగాతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:14 AM
International Yoga Day ప్రస్తుత జీవనశైలిలో మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగాయే దివ్యౌషధమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
అట్టహాసంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
మన లక్ష్యం ‘ఫిట్ శ్రీకాకుళం’: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
రికార్డుస్థాయిలో 4.50 లక్షల రిజిస్ట్రేషన్లు
నిత్యజీవితంలో యోగా భాగం కావాలి: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత జీవనశైలిలో మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగాయే దివ్యౌషధమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాకుళంలోని చారిత్రాత్మక డచ్ భవనం వద్ద జిల్లాయంత్రాంగం ఆధ్వర్యంలో భారీఎత్తున సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘యోగా ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంత, ఏకాగ్రత పెంపొందుతాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగంగా చేసుకొని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. జిల్లాను ‘ఫిట్ శ్రీకాకుళం’గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఈ నెల 7 నుంచి 15 రోజులపాటు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు యోగాపై విస్త్రృతంగా అవగాహన కల్పించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించాం. జిల్లావ్యాప్తంగా సుమారు 4,50,000 మంది యోగా శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. జిల్లాలో మూడు ప్రత్యేక ప్రాంతాల్లో థీమ్ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నెల 11న బారువలో, 16న డచ్ భవనం వద్ద, 19న శ్రీకూర్మం వద్ద వెయ్యిమంది చొప్పున సామూహిక యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నవారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ తెలిపారు. నగర ప్రజల సౌకర్యార్థం కార్గిల్ పార్క్ వద్ద ప్రత్యేకంగా ఒక యోగా ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రతి రోజూ ఆచరించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే భవిష్యత్తులో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనానికి ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు.
ఆకట్టుకున్న ఆసనాలు..
కార్యక్రమంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి ఆలపించిన యోగా గీతం సభికులను ఆకట్టుకుంది. యోగా గురువులు మురళీకృష్ణ, చినబాబు, సుధారాణి ఆధ్వర్యంలో వేలాది మందితో ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలు వేయించారు. యోగా సోలో, సింక్రోనైజ్డ్, స్లోగన్స్, వ్యాసరచన తదితర పోటీల్లో విజేతలకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో సాయిప్రత్యూష, జడ్పీ సీఈవో వెంకటరామన్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, నగర పాలకసంస్థ కమిషనర్ హెచ్.కూర్మారావు, డీఎంహెచ్‌వో అనిత, డీఈవో రవిబాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ వినాయక, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.