Share News

9 రోజులకు దొరికాడు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:39 AM

Amadalavalasa YCP in-charge arrested తనపై కేసు నమోదైన 9 రోజుల తర్వాత ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ దొరికిపోయారు. శనివారం సాయంత్రం చిలకపాలెం వద్ద పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అంతకుముందు ఉదయమే ఆయన అనుచరులు 9 మంది లొంగిపోయారు.

9 రోజులకు దొరికాడు
శ్రీకాకుళంలో డీఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుపై వైసీపీ శ్రేణుల హల్‌చల్‌తో నిలిచిన ట్రాఫిక్‌ .. ఇన్‌సెట్‌లో చింతాడ రవికుమార్‌

  • ఎట్టకేలకు ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి అరెస్టు

  • మహిళా ఎస్‌ఐ పట్ల అరాచకం కేసులో..

  • 21 మందిపై నాన్‌-బెయిలబుల్‌ కేసులు

  • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

  • ఉదయం 9 మంది లొంగుబాటు.. సాయంత్రం చిలకపాలెం వద్ద రవికుమార్‌ అరెస్టు

  • శ్రీకాకుళం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తనపై కేసు నమోదైన 9 రోజుల తర్వాత ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ దొరికిపోయారు. శనివారం సాయంత్రం చిలకపాలెం వద్ద పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అంతకుముందు ఉదయమే ఆయన అనుచరులు 9 మంది లొంగిపోయారు. గత నెల 30న వైసీపీ అధినేత సీఎం జగన్‌ పర్యటనలో మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై అరాచకం కేసులో పోలీసులు చింతాడతో పాటు ఆయన అనుచరలు 20 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు కాగానే చింతాడ పరారయ్యారు. తాను జిల్లాలోనే ఉన్నానంటూ రెండుసార్లు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎట్టకేలకు శనివారం అరెస్టు చేశారు.

  • చింతాడ రవికుమార్‌, అనుచరులపై నమోదైన సెక్షన్లు ఇవే..

  • తనపై జరిగిన దాడి, లైంగిక వేధింపులు, హత్యాయత్నంపై మహిళా ఎస్సై ఎం ప్రవళ్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు నిందితులపై క్రైమ్‌ నంబర్‌ 117/2026 కింద చింతాడ రవికుమార్‌తో పాటు మరో ఇరవై మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 109(1)(హత్యాయత్నం), 189(2), 191(2), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం), 121(1), 74, 79(మహిళ గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించడం), 351(2) రెడ్‌విత్‌ 190 తదితర నాన్‌-బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

  • 21 మంది నిందితులు వీరే

  • చింతాడ రవికుమార్‌, బొడ్డేపల్లి శ్రీను, అన్నెపు సంజయ్‌ కుమార్‌, అన్నెపు కృష్ణ, గురుగుబెల్లి చంద్రారావు, చింతాడ రఘునాథరావు, గురుగుబెల్లి భాస్కరరావు, దానేటి రామ్మోహన్‌నారడు, గురుగుబెల్లి తేజేశ్వరరావు, చిగురుపల్లి గిరి, నానుపాత్రుని సురేష్‌, దుంపల శ్రీనివాసరావు, ఇప్పిలి శశికుమార్‌, రాకోటి భాను, పొన్నాడ చిన్నారావు, కూన ధర్మారావు, గురుగుబెల్లి నవీన్‌, సనపల తవిటయ్య, మొదలవలస మురళి, చింతాడ యతికుమార్‌, కుసుమంచి హరీష్‌పై కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు సాక్షాధారాలు పరిశీలించి మరో ఏడుగురిని నిందితులుగా ఇందులో చేర్చారు.

  • 9మందికి 14 రోజుల రిమాండ్‌

  • మూడడ్ల రమణమూర్తి, ఖండాపు గోవిందరావు, సైరిగాపు శివ, పైల చిన్నబాబు, బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, చింతాడ గోదాకృష్ణ, చిగులపల్లి రవి, అన్నెపు సంజయ్‌కుమార్‌, గురుగుబిల్లి చంద్రరావు.. మొత్తం 9 మందిని ఆమదాలవలస పోలీసులు శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. వారిని శ్రీకాకుళంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. వీరిని జిల్లా జైలుకు తరలించారు.

Updated Date - Aug 09 , 2026 | 12:39 AM