ఇప్పుడే వచ్చేస్తానంటూ..
ABN , Publish Date - May 29 , 2026 | 12:11 AM
: శ్రీకా కుళంలోని సూర్య మహల్ జంక్షన్ సమీ పంలో గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బిర్లంగి గణేష్ (20) దుర్మరణం పాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
శ్రీకాకుళం క్రైం, మే 28 (ఆంధ్రజ్యోతి): శ్రీకా కుళంలోని సూర్య మహల్ జంక్షన్ సమీ పంలో గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బిర్లంగి గణేష్ (20) దుర్మరణం పాలయ్యాడు. ఇప్పుడే వెళ్లి వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్లిన ఆ కుమారుడు తల్లికి కడుపుకోత మిగిల్చాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు... హయాతినగరం సమీపంలో ఉన్న టీచర్స్ కాలనీకి చెందిన బిర్లంగి గణేష్ నగరంలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆయన తండ్రి రామారావు ఉపాధ్యాయుడిగా, తల్లి ఇందిర వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. అయితే గణేష్ గురువారం వేకుజామున ఐదు గంటల సమీపంలో తన స్నేహితుడి వద్ద బైక్‌ను తీసుకొని సూర్యమహల్ జంక్షన్ మీదుగా రామలక్ష్మణ జంక్షన్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యలో సన్‌మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌కు ఆనుకొని ఉన్న ర్యాంప్‌ను బైక్‌తో ఢీకొన్నాడు. దీంతో బైక్ గాలిలోకి లెగిసి దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కింద పడిపోవడంతో గణేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దంరావడంతో అటుగా వాకింగ్‌కు వెళుతున్నవారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గణేష్ మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ట్రాఫిక్ సీఐ వానపల్లి రామారావు తెలిపారు.
టీచర్స్ కాలనీలో విషాదచాయలు
చేతికి అందివచ్చి చేదోడు వాదోడుగా నిలుస్తాడని అనుకున్న కుమారుడు తిరిగి రాడని తెలుసుకున్న గణేష్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. గణేష్ తల్లి ఇందిర కుమారుడు మరణ వార్త విని విలపిస్తూ కుప్పకూలిపోయింది. ఆ ప్రాంత వాసులు, బంధువులంతా శోకసముద్రంలో నిలిచారు. వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కుమారుడు గంటల వ్యవధిలోనే మరి రాడని తెలిసిన ఆ తల్లి రోదన వర్ణణాతీతంగా మారింది.
జాగ్రత్త వహించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని, వారి మానసిక పరివర్తనను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ట్రాఫిక్ సీఐ వానపల్లి రామారావు కోరారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులుగాని, బంధువులు గాని వాహనాలు ఇవ్వవద్దని తెలిపారు. మైనర్లు పట్టుబడితే వాహనాలు ఇచ్చేవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు, ప్రమాదం జరిగిన తర్వాత లబోదిబోమనే బదులు వాహనాలు ఇచ్చే ముందు పూర్తి ఆలోచన చేయాలని సూచించారు.