Share News

కన్నతండ్రిని కడతేర్చాడు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:25 AM

The son who beat his father to death మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే కొట్టిచంపిన దారుణ సంఘటన మందస మండలం లోహరిబందలో ఆదివారం చోటుచేసుకుంది.

కన్నతండ్రిని కడతేర్చాడు
లక్ష్మీనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

తండ్రిని కొట్టి చంపిన తనయుడు

మందస మండలం లోహరిబందలో దారుణం

హరిపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే కొట్టిచంపిన దారుణ సంఘటన మందస మండలం లోహరిబందలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ కుమారుడు తాళ్ల ఏకాంబరం(రవి) మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసై గ్రామంలోనే తిరుగుతుండేవాడు. దీంతో మతిస్థిమితం కోల్పోవడంతో తండ్రి విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాడు. ఐదు రోజులుగా ఆసుపత్రిలో ఉండి తిరిగి రెండు రోజుల కిందటే ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే ఆదివారం మళ్లీ మద్యానికి డబ్బులు కావాలని అడిగి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. మందులు వాడుతున్నావు.. ఆరోగ్యం బాగుపడ్డాక డబ్బులు ఇస్తాను అని చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురై తండ్రి లక్ష్మినారాయణతో కొట్లాటకు దిగాడు. పిడిగుద్దులు గుద్దుతూ నేలకేసి కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ కె కృష్ణప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Apr 06 , 2026 | 12:25 AM