అన్నట్లే ఫెయిల్ చేశాడు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:09 AM
Another controversy at BRAU ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ విద్యార్థినితో గతంలో ఆయన చేసిన వాట్సాప్ చాటింగ్ స్ర్కీన్‌షాట్స్ వైరల్ అవుతున్నాయి.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం
బీఆర్‌ఏయూలో మరో వివాదం
ఓ విద్యార్థినితో వాట్సాప్ చాటింగ్
ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు
ఎచ్చెర్ల రూరల్, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ విద్యార్థినితో గతంలో ఆయన చేసిన వాట్సాప్ చాటింగ్ స్ర్కీన్‌షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ.. ‘డిపార్ట్‌మెంట్‌కు రేపు రా. నేను చెప్పినట్టు చేయు’ అని ఆ ప్రొఫెసర్ చెప్పారు. ఆ విద్యార్థిని ‘సారీ సర్.. నేను రాలేను’ అని తిరిగి సమాధానమిచ్చింది. దీంతో ‘సరే నువ్వు రావొద్దు.. నీకు హాజరు వేయకుండా.. పరీక్షల్లో కూడా ఫెయిల్ చేస్తా’నని ఆ ప్రొఫెసర్ హెచ్చరించారు. తాజాగా ఈ నెల 4న నాలుగో సెమిస్టర్ ఫలితాలు వచ్చాయి. కాగా.. ఆ విద్యార్థిని ఫెయిలైంది. గత మూడు సెమిస్టర్లలో 80 శాతానికిపైగా మార్కులు వచ్చాయి. 4వ సెమిస్టర్‌లో మాత్రం ప్రోగ్రామింగ్ ఇన్ సీ, పార్టిల్ డిఫరెంటియల్ ఈక్యూషన్‌లో ఫెయిల్ గ్రేడ్ వచ్చింది. దీంతో గతంలో చెప్పినట్టుగానే.. ఆ ప్రొఫెసర్ తనను ఫెయిల్ చేశాడని ఆ విద్యార్థిని ఆరోపిస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతోంది. ఈ విషయమై రిజిస్ర్టార్ బిడ్డిక అడ్డయ్యను ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన స్పందించలేదు. ఉన్నతాధికారులు సైతం దీనిపై నోరు మెదిపేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికే ఇంజినీరింగ్ విద్యార్థినికి ఫోన్ కాల్‌లో ఓ కాంట్రాక్టు ప్రొఫెసర్ అసభ్య, లైంగిక వేధింపుల ఆడియో రికార్డింగ్ బయటపడింది. దీనిపై త్రిసభ్య కమిటీ విచారణ సాగుతోంది. తాజాగా.. మరో విద్యార్థిని, ప్రొఫెసర్ మధ్య వాట్సాప్ చాటింగ్ స్ర్కీన్‌షాట్‌లు కలకలం రేపుతున్నాయి.