Share News

నమ్మించాడు..చెరపట్టాడు.. చంపేశాడు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:14 AM

బాలికను చదివిస్తానన్నాడు. అండగా ఉంటానన్నాడు. నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లిచేసుకోమని అడితే దారుణంగా చంపేశాడు.

 నమ్మించాడు..చెరపట్టాడు.. చంపేశాడు
నిందితుడిని పోలీసు వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యం

-ట్యూషన్‌ చెబుతానని వెంట తీసుకెళ్లి..

-బాలికపై పలుమార్లు అత్యాచారం

-పెళ్లిచేసుకోమని అడగడంతో హత్య

-నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు

బాలికను చదివిస్తానన్నాడు. అండగా ఉంటానన్నాడు. నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లిచేసుకోమని అడితే దారుణంగా చంపేశాడు. తర్వాత బాలిక ఆరోగ్యం బాగాలేదని కారులో తెచ్చి అప్పగించాడు. అచేతనంగా ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే మృతిచెందింది. పోలీసులు లోతుగా విచారిస్తే ఈ ఘోరం వెలుగుచూసింది. గతనెల 24న జరిగిన ఈ ఘటనలో పోలీసులు నిందితుడు వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు.

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట గ్రామానికి చెందిన కలవల వెంకటేశ్వరరావు(55) చిన్న కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. తన వద్ద పనిచేసే మహిళలతో పరిచయం పెంచుకుని, వారి పిల్లలకు చదువు, ఆర్థికసాయం పేరుతో నమ్మకం కలిగించేవాడు. అమాయక బాలికలకు మాయమాటల చెప్పి, వ్యసనాలకు బానిసలను చేసి, రహస్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు చేసి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈక్రమంలోనే పాత హిరమండలానికి చెందిన ఓ గిరిజన బాలిక(17)ను చదువు పేరుతో విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోని ఓ కళాశాలలో చేర్పించాడు. గార్డియన్‌గా ఉంటూ ఎస్‌.కోట, విశాఖపట్నంలోని సుజాతనగర్‌లో తన ఇళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మార్చిలో ఊరికి వచ్చిన బాలికను అదేనెల 22న మధ్యాహ్నం ఇంటర్‌ ఇంగ్లీష్‌ పరీక్షకు ట్యూషన్‌ చెబుతానని తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం తీసుకెళ్లి కొత్త బట్టలు కొనిచ్చాడు. తన ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ నేపథ్యంలో గతనెల 24న పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్వరరావు బాలికను హత్య చేశాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పాడు. బాలిక చిన్నాన్న ఊరికి వారిని రప్పించి కారులో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చూపించాడు. ఆందోళనకు గురైన తల్లి రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు

బాలిక తల్లి ఫిర్యాదుతో హిరమండలం పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ వివేకానంద దర్యాప్తు చేపట్టి గతనెల 31న వెంకటేశ్వరరావును హిరమండలంలో అరెస్టు చేశారు. నిందితుడ్ని బుధవారం శ్రీకాకుళం కోర్టుకు తరలిస్తుండగా కొంతమంది అతడ్ని దూషించారు. దీంతో పోలీసులు అతడ్ని వాహనంలో తరలించారు. డీఎస్పీ వివేకానంద, కొత్తూరు సీఐ సీహెచ్‌ ప్రసాద్‌, శ్రీకాకుళం రూరల్‌ సీఐ పైడాపునాయుడు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 02 , 2026 | 12:14 AM