రెండు చేతులు, కన్ను కోల్పోయి..
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:18 AM
Today is Kargil Vijay Diwas ‘దేశాన్ని ముక్కలుగా చేసి ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని పాకిస్థాన్ ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. ప్రాణాలు ఎదురొడ్డి.. మా రక్తం చిందించి దేశాన్ని కాపాడుకున్నామ’ని కంచిలి మండలానికి చెందిన కార్గిల్ యుద్ధవీరులు బుద్ధాన జయకృష్ణ, పైల మన్మథరావు తెలిపారు.
రక్తం చిందించి దేశాన్ని కాపాడుకున్నాం
కార్గిల్ యుద్ధ వీరుల అనుభవాలు
జయకృష్ణకు పరాక్రమ చక్ర బిరుదుతో సత్కారం
నేడు కార్గిల్ విజయ్ దివస్
కంచిలి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘దేశాన్ని ముక్కలుగా చేసి ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని పాకిస్థాన్ ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. ప్రాణాలు ఎదురొడ్డి.. మా రక్తం చిందించి దేశాన్ని కాపాడుకున్నామ’ని కంచిలి మండలానికి చెందిన కార్గిల్ యుద్ధవీరులు బుద్ధాన జయకృష్ణ, పైల మన్మథరావు తెలిపారు. ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నాటి రణరంగంలో పాల్గొని శత్రువులను తుదముట్టించిన అనుభవాలను వారు ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
అది మైనస్ డిగ్రీల చలి ప్రాంతం. నిలువెత్తు మంచుకొండలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుతో జరిపిన హోరాహోరి పోరు. 1999 జూలై 26న పాకిస్థాన్ కుట్రలను తిప్పికొడుతూ భారత సైన్యం సాధించిన విజయమే కార్గిల్ యుద్ధం. అప్పట్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన నార్తర్న్ లైట్ ఇన్పాంట్రీ కొండ ప్రాంతంలోకి చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. భారత గొర్రెల కాపరులు ఇచ్చిన సమచారంత అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌ను ప్రారంభించింది. ఎత్తయిన మంచు పర్వతాలపై శత్రువు వ్యూహాత్మక స్థానాల్లో ఉన్నప్పటికీ, భారత జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి శత్రుమూకలను ఏరిపారేశారు. పాకిస్థాన్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టి, శత్రు ఆక్రమణ నుంచి మాతృభూమిని విముక్తి చేసిన చేసినందుకు గుర్తుగా ఏటా కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటున్నాము.
అవయవాలు కోల్పోయినా.. గర్వంగా ఉంది
కార్గిల్ యుద్ధం సమయంలో సిపాయిగా విధులు నిర్వహించాను. పాకిస్థాన్ ఉగ్రమూకలు దేశాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. ఉగ్రమూకలను ఎదురొడ్డి.. రక్తం చిందించి దేశాన్ని కాపాడుకున్నాం. ప్రాణం పోయినా ఫర్వాలేదు. దేశం కోసం.. ప్రజల కోసం ఉగ్రమూకలను తుదముట్టించేందుకు పోరాడాం. యుద్ధం సమయంలో రెండు చేతులు, కుడి కన్ను పోగొట్టుకున్నాను. అవయవాలు కోల్పోయినా నాకు బాధ లేదు. యుద్ధంలో గెలిచినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా పోరాటానికి గుర్తింపుగా పరాక్రమ చక్ర బిరుదు ఇవ్వడం ఆనందాన్నిచ్చింది. అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా కార్గిల్ స్మారక చిహ్నం నిలుస్తోంది. ప్రస్తుతం సోంపేట మండలం బాలుర ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. భార్య భాగ్యలక్ష్మీతోపాటు కుమారుడు, కుమార్తెతో జీవనం సాగిస్తున్నాను.
- బుద్ధాన జయకృష్ణ, బిన్నలకొత్తూరు, కంచిలి
ఉగ్రమూకలను తరమడమే లక్ష్యంగా..
కార్గిల్ యుద్ధ సమయంలో బ్రాస్ సెక్టార్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహించాను. అప్పట్లో తీవ్రవాదులకు పాక్ సైన్యం సహకరిస్తూ చొరబాటుకు యత్నించగా భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది. ప్రాణాలు అర్పించైనా.. ఉగ్రమూకలను తరమడమే లక్ష్యంగా పోరాడాం. భారత సైన్యంలో పనిచేయడం గర్వకారణంగా భావిస్తున్నాను. దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం. యువత దేశభక్తిని పెంపొందించుకుని సాయుధ దళాల్లో చేరాలి.
- పైల మన్మథరావు, పురుషోత్తపురం, కంచిలి