Share News

అంతవరకూ అందరితో కలిసి ఉండి..

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:11 AM

మందస మండలం టబ్బాగాం గ్రామానికి చెందిన ఐటీబీపీ (ఇండోటిబెటన్‌ బోర్డర్‌ పోలీసు) జవాన్‌ సవర శేషగిరి(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 అంతవరకూ అందరితో కలిసి ఉండి..
శేషగిరి(ఫైల్‌)

  • ఐటీబీపీ జవాన్‌ ఆత్మహత్య

హరిపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మందస మండలం టబ్బాగాం గ్రామానికి చెందిన ఐటీబీపీ (ఇండోటిబెటన్‌ బోర్డర్‌ పోలీసు) జవాన్‌ సవర శేషగిరి(28) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సవర శేషగిరి ఐటీబీపీలో సుమారు ఆరేళ్ల కిందట జవాన్‌గా చేరి ఒడిశాలోని ఖుర్దారోడ్‌ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చాడు. అందరితోనూ ఎంతో సరదా ఉండే శేషగిరి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి ... రాత్రికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ వస్తోంది. బుధవారం ఉదయం జీడి తోటలకు పనులకు వెళ్లిన గ్రామస్థులకు జీడిచెట్టుకు ఉరి వేసుకొని.. విగతజీవిగా శేషగిరి కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకి దింపి పరిశీలించారు. అప్పటికే మృతిచెందినట్లు స్థానిక వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించి... కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరావటం లేదని, తల్లిదండ్రులను, బంధువులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 03 , 2026 | 12:11 AM