Share News

తల్లికి సాయం చేయాలని వెళ్లి...

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:09 AM

అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లికి పనిలో సాయం చేయాలని అనుకున్నాడా కుమారుడు. సాయం చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు అతన్ని కాటేసింది.

తల్లికి సాయం చేయాలని వెళ్లి...
మోహనరావు (ఫైల్‌)

  • విద్యుదాఘాతంతో కుమారుడి మృతి

కవిటి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లికి పనిలో సాయం చేయాలని అనుకున్నాడా కుమారుడు. సాయం చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు అతన్ని కాటేసింది. కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల మేరకు... స్థానిక పోలీసు స్టేషనులో లిమ్మాయి రుక్మిణి గత 17 ఏళ్లుగా ప్రైవేట్‌ స్వీపరుగా విధులు నిర్వహిస్తోంది. రుక్మిణికి ఆరోగ్యం బాగాలేదని.. ఆమెకు బదులుగా కుమారుడు లిమ్మాయి మోహనరావు(39) బుధవారం స్టేషనుకు వెళ్లి శుభ్రపరిచే పనులు చేపట్టాడు. ఆ తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టులో కాయలు తీయబోయాడు. అక్కడే ఉన్న ఇనుప పైపుతో కాయలను చెట్టు నుంచి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లకు పైపు తగిలింది. దాంతో మోహనరావు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య ప్రమీలతో ఉజ్వల్‌(10), అనూజ (రెండున్నరేళ్లు) అనే పిల్లలు ఉన్నారు. గ్రామంలో స్వీపరు పనులు చేసుకొంటూ మోహనరావు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమకు ఆధారమైన వ్యక్తి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:09 AM