ఉపాధి కోసం వెళ్లి..
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:08 AM
Youngman faced problems in Iran జిల్లావాసులకు విదేశీ కష్టాలు తప్పడం లేదు. స్థానికంగా ఆశించినస్థాయిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ పడరానిపాట్లు పడుతున్నారు. తాజాగా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం ఇరాన్ వెళ్లి.. నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఇరాన్‌లో చిక్కుకున్న జిల్లా యువకుడు
నాలుగు నెలలుగా వేతనాలు లేక అవస్థలు
సంతబొమ్మాళి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులకు విదేశీ కష్టాలు తప్పడం లేదు. స్థానికంగా ఆశించినస్థాయిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ పడరానిపాట్లు పడుతున్నారు. తాజాగా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం ఇరాన్ వెళ్లి.. నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం ఎస్.బి.కొత్తూరు గ్రామానికి చెందిన వంకల రవి ఇరాన్‌లో చిక్కుకున్నాడు. పది నెలల కిందట ముంబైలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సీమెన్‌గా చేరాడు. అయితే ఆ షిప్ నాలుగు నెలల కిందట ఇంజన్ పాడవడంతో ఇరాన్‌లో నిలిచిపోయింది. నాలుగు నెలలుగా షిప్ యజయాని దానికి మరమ్మతులు చేయడం లేదు. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని రవి.. ఇటీవల తన తల్లిదండ్రులు గోపాలరావు, కృష్ణమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. భోజనాలు, స్నానం లేక ఇబ్బందులు పడుతున్నామని, షిప్ యజమాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరాన్ యుద్ధ పరిస్థితులు కారణంగా ఇక్కడ వాతావరణం దారుణంగా ఉందని తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవ చూపి తమ కుమారుడ్ని స్వగ్రామానికి క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.