Share News

చెడు వ్యసనాలకు బానిసై..

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:33 PM

చెడు వ్యసనాలకు బానిసైన నలుగురు వ్యక్తులు డబ్బుల్లేక గంజాయి విక్రయాలను ప్రారంభించారు.

 చెడు వ్యసనాలకు బానిసై..
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌

- గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు

- 3.700 కిలోలు స్వాధీనం

పలాస, జనవరి 7(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసైన నలుగురు వ్యక్తులు డబ్బుల్లేక గంజాయి విక్రయాలను ప్రారంభించారు. ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈక్రమంలో కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి 3 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌, సీఐ వై.రామకృష్ణ బుధవారం విలేకరులకు వెల్లడించారు. పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన సాహు ఆనంద్‌, వడ్డి లోకనాథం, నీలిభద్ర గ్రామానికి చెందిన అన్నదమ్ములు (మైనర్లు) బ్రాహ్మణతర్లా హైస్కూల్‌లో చదువుకున్నారు. వీరంతా చెడు వ్యసనాలకు బానిసయ్యారు. మద్యం, సిగరెట్లు తాగడంతో పాటు గంజాయికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో బరంపురం(ఒడిశా)కు చెందిన పప్పు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పప్పు నుంచి వీరు గంజాయిని కొనుగోలు చేసి, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లగా కట్టి కావాల్సినవారికి విక్రయించేవారు. ఈ క్రమంలో 3.700 కిలోల గంజాయిని పప్పు వద్ద కొనుగోలు చేసి మంగళవారం సాయంత్రం బ్రాహ్మణతర్లా వస్తుండగా కంబిరిగాం బ్రిడ్జి వద్ద కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్‌.నర్సింహమూర్తికి తారాస పడ్డారు. వారి వద్ద ఉన్న గోనె సంచిని పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి మొత్తం నలుగుర్ని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - Jan 07 , 2026 | 11:33 PM