యంత్రాలతో కోత.. దొరకని మేత
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:14 AM
Scarcity of paddy straw పశుపోషణకు వరిగడ్డి దొరక్క పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏ గ్రామంలో చూసినా అధికశాతం మంది రైతులు వరి కోతలు, నూర్పుల్లో యంత్రాలే వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి లభ్యం కావడం లేదు.
జిల్లాలో వరిగడ్డి కొరత
పశుపోషణకు పాడిరైతుల ఇబ్బందులు
ఒడిశాలో అధిక ధరకు కొనుగోలు
ఇచ్ఛాపురం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పశుపోషణకు వరిగడ్డి దొరక్క పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏ గ్రామంలో చూసినా అధికశాతం మంది రైతులు వరి కోతలు, నూర్పుల్లో యంత్రాలే వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి లభ్యం కావడం లేదు. గతంలో వరి పంటను కూలీలతో కోయించి సంప్రదాయ నూర్పులు చేసేవారు. మరికొందరు చొప్పలు కట్టించి కొట్టించేవారు. అలా ధాన్యం పోనూ వచ్చిన వరిగడ్డిని.. పశువులకు మేత(గ్రాసం)గా వినియోగించేవారు. ఏడాది పొడవునా వరిగడ్డిని భద్రపరిచేవారు. కొంతమంది శాలల పైకప్పుగా కూడా వరిగడ్డి వాడేవారు. కానీ ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేక చాలామంది రైతులు యంత్రాలతో నూర్పులు చేపడుతుండడంతో కనీసస్థాయిలో పశువులకు గడ్డి దొరకడం లేదు.
జిల్లాలో ఆవులు, ఎద్దుజాతి పశువులు 4,56,291 ఉన్నాయి. గేదె జాతి పశువులు 40,477 ఉన్నాయి. జిల్లాలో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. కానీ భారీ యంత్రాలతో వరి కోతలు, నూర్పులు చేస్తుండడంతో వరిగడ్డి పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఎందుకూ పనికి రాకుండా పోతోంది. స్థానికంగా వరిగడ్డి దొరక్క కొంతమంది రైతులు ఒడిశాలో కొనుగోలు చేసి తెస్తున్నారు. వరి గడ్డికి ఉన్న డిమాండ్‌ను కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టరు లోడు గడ్డిని రూ.4వేల వరకూ విక్రయిస్తున్నారు. గతంలో లోడు గడ్డి కేవలం రూ.1000 మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం నాలుగింతలు ధర పెరగడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. పాడిరైతుల్లో ఎక్కువ మంది భూములు లేనివారే ఉన్నారు. అటువంటి వారు వరిగడ్డి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పశుపోషణ భారమవుతోందని వాపోతున్నారు.
గడ్డి లభ్యత లేక..
ప్రస్తుతం పశువులకు సరిపడినంత వరిగడ్డి లభ్యం కావడం లేదు. అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో ట్రాక్టరు లోడు రూ.వెయ్యికి లభించేది. కానీ ఇప్పుడు రూ4వేలు నుంచి రూ.5 వేల వరకూ పలుకుతోంది. భారమైనా పశుపోషణకు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తోంది.
- కరగాన వెంకట నరేష్, గొల్లవీధి, ఇచ్ఛాపురం
చాలా భారం..
పశుపోషణ సైతం భారంగా మారుతోంది. దాణా ధరలు సైతం పెరిగాయి. వరిగడ్డి అందుబాటులో ఉంటేనే పశుపోషణ సాధ్యమయ్యేది. కానీ ఇప్పడు దాణాతో పాటు పశుగ్రాసం ధర కూడా పెరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఇలా అయితే పశువులను పోషించలేం.
డి.శేఖర్, ఇచ్ఛాపురం