బేడీలు వేసి.. తుపాకీతో బెదిరించి
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:41 PM
కాశీబుగ్గలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి బంగారు దుకాణంలోకి చొరబడ్డారు.
- కాశీబుగ్గలో దొంగల బీభత్సం
- పోలీసులమని చెప్పి బంగారు దుకాణంలోకి చొరబాటు
- షాపు యజమానిపై దాడి
- కిలో బంగారం దోపిడీ
పలాస, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి బంగారు దుకాణంలోకి చొరబడ్డారు. పోలీసులమని చెప్పి షాపు యజమాని చేతులకు బేడీలు వేశారు. అనంతరం తుపాకీతో బెదిరించి.. అతనిపై పిడిగుద్దులు కురిపించారు. దుకాణంలోని కేజీ బంగారు ఆభరణాలతో పాటు షాపు యజమాని ఒంటిపై ఉన్న నగలు సైతం దోపిడీ చేసి ఉడాయించారు. ప్రత్యక్ష సాక్షులు, షాపు యజమాని, కాశీబుగ్గ పోలీసుల వివరాల మేరకు.. కాశీబుగ్గ నిత్యానందనగర్‌లో కిల్లంశెట్టి రామకృష్ణారావు అనే వ్యక్తి బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన వద్ద ఓ కార్మికుడు పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ కార్మికుడు బయటకు వెళ్లిన సమయంలో మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు మాస్కులు ధరించి షాపులోకి ప్రవేశించారు. వెంటనే షాపు గ్లాస్ అద్దాలను వేశారు. తాము పోలీసులమని చెప్పి షాపు యజమాని రామకృష్ణారావు చేతికి బేడీలు వేశారు. దీంతో హతాసుడయిన ఆయన వచ్చిన వారంతా పోలీసులుగా భావించి ఎదురు ప్రశ్నించలేకపోయారు. అనంతరం ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. తుపాకీని ఆయన నుదుటిపై పెట్టి అరిచావంటే హతమారుస్తామని బెదిరించారు. దీంతో వచ్చినవారు దొంగలని రామకృష్ణారావుకు అర్థమైంది. అయితే, కనీసం అరవడానికి కూడా సమయం ఇవ్వకుండా క్యాష్ కౌంటర్ వద్దకు ఆయన్ను తీసుకెళ్లారు. లాకర్ తాళాలు తెరవాలని అందులోని ఇద్దరు వ్యక్తులు బెదిరించారు. మరో నలుగురు వ్యక్తులు సోకేష్‌లో పేర్చిన బంగారు నగలన్నీ వారు తెచ్చుకున్న బ్యాగులో వేసుకున్నారు. అనంతరం లాకర్ తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలన్నీ బ్యాగులో సర్దుకున్నారు. మరో వ్యక్తి రామకృష్ణారావు వద్దకు వచ్చి ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపి జేబులో వేసుకున్నాడు. షాపులో ఉన్న వెండి ఆభరణాలను ముట్టలేదు. షాపు బయట మరో ముగ్గురు వ్యక్తులు ఉండి ఎవరైనా వస్తున్నారా అని పరిశీలించారు. మొత్తం వ్యవహారమంతా పూర్తవడంతో 12.35 గంటలకు షాపు నుంచి కొనుగోలుదారులుగా నటిస్తూ బయటకు వచ్చారు. ఈ దోపిడీలో మొత్తం 8 మంది పాల్గొనగా, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కారును తమతో తీసుకువచ్చి అందులో ఉడాయించారు. సంఘటనా స్థలానికి ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, జిల్లా క్లూస్, డాగ్‌స్వ్కాడ్ బృందం చేరుకొని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు బృందాలను నియమించి నేరగాళ్ల కోసం వెతుకున్నామని, కేసును తొందరలోనే ఛేదిస్తామని ఏఎస్పీ శ్రీనివాసరావు విలేకర్లకు తెలిపారు.
సీసీ ఫుటేజీ పరిశీలన..
మొత్తం 8 మంది దొంగలు ఉన్నట్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారిలో కొందరు తెలుపు బనియన్ ధరించి ఉన్నారు. వెనుక పోలీసు అన్న ఇంగ్లీషు పేర్లు ఉన్నాయి. అందరూ ముఖానికి మాస్క్‌లు ధరించి టోపీలు పెట్టుకున్నారు. భగవతి థియేటర్ రోడ్డులో కారు, మంకినమ్మ గుడి ప్రాంతంలో ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసి చోరీకి వచ్చారు. దొంగతనం తరువాత దర్జాగా బ్యాగులతో వారు తెచ్చుకున్న వాహనాల్లో ఉడాయించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. వీరంతా గొప్పిలి మీదుగా ఒడిశాకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఒడిశా ముఠా సభ్యులుగా తెలుస్తోంది. వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు కొంతమంది తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. దోపిడీకి పాల్పడిన వారంతా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారే.
పోలీసులనుకుని వదిలేశారు..
దొంగలు షాపు నుంచి బయటకు రావడం.. వారంతా మాస్కులు ధరించడంతో చుట్టుపక్కల వారికి అనుమానాలు కలిగాయి. అయితే వారు వేసుకున్న బనియన్‌లపై పోలీసు అన్న పేరు ఉండడంతో వచ్చిన వారు ప్రత్యేక పోలీసులు, నిఘా పోలీసులుగా భావించి వారికి ఎటువంటి ప్రశ్నలు వేయలేకపోయారు. అయితే, బాధితుడు రామకృష్ణారావు బయటకు బేడీలతో వచ్చి రక్షించాలని స్థానికులను కోరగా, పోలీసులు వేసిన బేడీలు తాము ఏ విధంగా తీయగలమని వారు ప్రశ్నించారు. అయితే తనకు బేడీలు వేసింది పోలీసులు కాదని, దోపిడీ దొంగలని చెప్పడంతో స్థానికులు దొంగల కోసం పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామకృష్ణ తన బృందంతో వచ్చి చోరీ జరిగిన తీరు పరిశీలించారు. కాగా, రామకృష్ణారావు చేతికి వేసిన బేడీలు రంపానికి కూడా తెగలేదు. దీంతో విద్యుత్ కట్టర్‌ను తీసుకువచ్చి అతికష్టంపై వాటిని తొలగించారు. పట్టపగలే దొంగలు దోపిడీ పాల్పడడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పలాస-కాశీబుగ్గ బంగారు వర్తక సంఘం సంఘీభావం తెలిపింది. వ్యాపారులు మొత్తం షాపులన్నీ బంద్ చేసి రామకృష్ణారావును ఓదార్చారు.