Share News

సగం డీపట్టా.. సగం జిరాయితీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:26 AM

Irregularities in the arrangement of layouts నరసన్నపేట పట్టణంలో భూముల విలువ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల డీపట్టా భూములు, ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లను వేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తొలుత మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు డీపట్టా భూములను కొనుగోలు చేస్తున్నారు.

సగం డీపట్టా.. సగం జిరాయితీ
గొట్టిపల్లి వృద్ధాశ్రమం వద్ద ప్రభుత్వ గోర్జిని చదును చేసి వేసిన లేఅవుట్‌

  • లేఅవుట్ల ఏర్పాటులో అక్రమాలు

  • నరసన్నపేట పరిసరాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం

  • కానరాని సుడా అనుమతులు

  • ప్రభుత్వ ఆదాయానికి గండి

  • నష్టపోతున్న కొనుగోలుదారులు

  • నరసన్నపేట, మార్చి 2(ఆంధ్రజ్యోతి):

  • నరసన్నపేట పట్టణంలో భూముల విలువ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల డీపట్టా భూములు, ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లను వేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తొలుత మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు డీపట్టా భూములను కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటి పక్కనే ఉన్న జిరాయితీ భూములను కూడా కొనుగోలు చేసి మొత్తం ఒకే సర్వే నెంబరులో ఉన్నట్లు ప్లాన్‌లో చూపించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా నరసన్నపేటకు సమీపంలో ఉన్న బొరిగివలస, కోమర్తి, గొట్టిపల్లి, కరగాం, జమ్ము, తామరాపల్లి, దేవాది, జమ్ము పంచాయతీలతోపాటు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పదికి పైగా అక్రమ వెంచర్లు వెలిశాయి. వీటిపై పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • కొన్ని ఉదాహరణలు..

  • గొట్టిపల్లి పంచాయతీ వృద్ధాశ్రమానికి సమీపంలో సుమారు ఎకరా విస్తీర్ణం గల బండి గోర్జిని ఆక్రమించి లేఅవుట్‌ వేశారు. ఒక మార్కెటింగ్‌ సంస్థ ఈ లేఅవుట్‌ను జిరాయితీ భూమిగా తప్పుడు పత్రాలను చూపించి ప్లాట్లను విక్రయిస్తోంది. అక్కడే ఉన్న కొండను సైతం చదును చేసి లేఅవుట్‌లో కలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి.

  • గొట్టిపల్లి రెవెన్యూ పరిధి జమ్ము సమీపంలో పోరంబోకు స్థలాన్ని చదును చేసి లేఅవుట్‌ వేశారు. దాన్ని జిరాయితీ భూమిగా చూపించి ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు.

  • బొరిగివలస రెవెన్యూ పరిధిలోని వెంకన్న చెరువు గర్భాన్ని ఆక్రమించి ప్లాట్లు వేశారు.

  • జమ్ము జంక్షన్‌ వద్ద వంశధార కాలువ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్‌ వేసి విక్రయాలు చేపట్టారు.

  • సుడా అనుమతులు లేకుండానే..

  • నరసన్నపేట మండలం సుడా పరిధిలో ఉంది. సుడా అనుమతుల మేరకే ఎవరైనా వెంచర్లు వేయాలి. కానీ, కొందరు రియల్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేసి, మూడేసి ఎకరాల్లో చిన్నచిన్న లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనల ప్రకారం వెంచర్ల వద్ద సామాజిక అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాలి. పాఠశాల, పార్కు, సామాజిక భవనం తదితర అవసరాలకు 20 శాతం నుంచి 40 శాతం వరకు స్థలాన్ని ఉంచాలి. 40 అడుగుల మేర రోడ్లను ఏర్పాటు చేయాలి. కానీ, ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వానికి ప్రస్తుత మార్కెట్‌ ధరకు అనుగుణంగా రుసుం చెల్లించాలి. కానీ, కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎలాంటి రుసుం చెల్లించకుండానే వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మకాలు చేపడుతున్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొనుగోలుదారులు మోసానికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటాం

  • ప్రభుత్వ స్థలాలు, డీపట్టా భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. సుడా అనుమతి తదితర విషయాలను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలి.

    - సత్యనారాయణ, తహసీల్దార్‌, నరసన్నపేట

Updated Date - Mar 03 , 2026 | 12:26 AM