జై.. జై.. గణేశా
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:25 AM
Today is Vinayaka Chavithi వినాయకచవితి పండుగకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా.. వీధివీధినా గణనాథుడి విగ్రహాలను కొలువు దీర్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు మండపాలు సిద్ధం చేశారు. జిల్లాకేంద్రం, పట్టణాల నుంచి వినాయక విగ్రహాలను వాహనాల్లో తీసుకెళ్లి మండపాల్లో భద్రపరిచారు.
నేడు వినాయకచవితి
నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన మండపాలు
కిటకిటలాడిన మార్కెట్‌లు
పెరిగిన పూజాసామగ్రి ధరలు
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి పండుగకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి గణపతి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా.. వీధివీధినా గణనాథుడి విగ్రహాలను కొలువు దీర్చేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు మండపాలు సిద్ధం చేశారు. జిల్లాకేంద్రం, పట్టణాల నుంచి వినాయక విగ్రహాలను వాహనాల్లో తీసుకెళ్లి మండపాల్లో భద్రపరిచారు. మరోవైపు మండపాలు, వీధుల్లో విద్యుత్ దీపాలు అలంకరించారు. వినాయకచవితిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాముల మార్కెట్, రైతుబజారు, ఇతర ప్రాంతాల్లో మార్కెట్లు రద్దీగా కనిపించాయి. ఓ వైపు కొద్దిపాటి వర్షం కురిసినా.. పూజాసామగ్రి కొనుగోలు కోసం ప్రజలు మార్కెట్‌కు తరలివచ్చారు. వినాయక విగ్రహాలతోపాటు పండ్లు, పూలు, పూజాసామగ్రి విరివిగా కొనుగోలు చేశారు. కాగా.. పూజాసామగ్రి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆవేదన చెందారు. మార్కెట్‌లో కేజీ ద్రాక్ష రూ.200, కేజీ విరులు రూ.400, అరటిపండ్లు పెడ రూ.150, ఒక్కో కొబ్బరికాయ రూ.50 నుంచి రూ.70 వరకు, చెరకు గెడ రూ.50, యాపిల్, దానిమ్మ కేజీ రూ.150 చొప్పున విక్రయించారు. పూల ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. పూజ నిమిత్తం తప్పనిసరి పరిస్థితులో కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విగ్రహాలు, పూజాసామగ్రి కొనుగోలుదారులతో ఆదివారం శ్రీకాకుళంలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో.. పోలీసులు క్రమబద్ధీకరించారు. వినాయకచవితి వేడుకల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో అనుమతులు మంజూరు చేశారు. డీజేల వినియోగంపై నిషేధం విధించారు. ఉత్సవాల్లో మద్యం, నిషేధిత వస్తువులు ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మట్టి వినాయకుడిని పూజిద్దాం: మంత్రి అచ్చెన్నాయుడు
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లావాసులంతా మట్టివినాయక విగ్రహాలను పూజించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిద్దాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాల’ని మంత్రి ఆకాంక్షించారు.