గుండ అప్పలసూర్యనారాయణ కన్నుమూత
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:44 AM
TDP senior leader dead టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ (78) తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం అరసవల్లిలోని స్వగృహంలో ఆయన కాలుజారి పడగా తలకు తీవ్రగాయమైంది.
చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి
రాజకీయాల్లో అజాత శత్రువు ఆయన. తెలుగుదేశంపార్టీ వీరవిధేయుడు. పార్టీ కార్యకర్తలు మెచ్చిన నేత. ప్రజల అభిమాన నాయకుడు కూడా. రాజకీయ జీవితంలో మచ్చలేని లీడర్. కౌన్సిలర్ నుంచి మంత్రి వరకు ఎన్నో పదవులను అలంకరించారు. వాటికి న్యాయం చేశారు. అలాంటి ఆయన 45 ఏళ్ల ప్రజా జీవితాన్ని వీడి వెళ్లిపోయారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
శ్రీకాకుళం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ (78) తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం అరసవల్లిలోని స్వగృహంలో ఆయన కాలుజారి పడగా తలకు తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బగ్గు సరోజినీదేవి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ.. సోమవారం రాత్రి 6.45 గంటలకు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సీఎం చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు.. గుండ అప్పలసూర్యనారాయణ నివాసానికి చేరుకుని.. ఆయన భౌతికదేహానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో మాట్లాడి ఆమెను ఓదార్చారు. మంత్రితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు.
ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి.. నాలుగుసార్లు గెలుపొంది..
శ్రీకాకుళం రాజకీయాల్లో గుండ అప్పల సూర్యనారాయణ తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించి.. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉన్నారు. 1948 జనవరి 16లో జన్మించిన అప్పలసూర్యనారాయణ.. బీకాం, బీఎల్ చదివారు. 1981లో శ్రీకాకుళం మునిసిపల్ కౌన్సెలర్‌గా గెలుపొంది.. అప్పట్లో వైస్‌చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1983లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. నందమూరి తారక రామారావు పిలుపుతో టీడీపీలో చేరి 1985లో పోటీ చేసి తొలిసారిగా శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున వరుసగా నాలుగుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1989లో సోషల్ వెల్ఫేర్ మంత్రిగాను... కరువు నివారణ మంత్రిగానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. పదేళ్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగాను, పలు అసెంబ్లీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా, ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా, సింహాచలం దేవస్థానం కమిటీ చైర్మన్‌గా ప్రజలకు సేవలందించారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి టీడీపీ తరఫున 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇద్దరు కుమారులు అమెరికాలో..
గుండ దంపతులకు ఇద్దరు కుమారులు శివగంగాఽధర్, విశ్వనాథ్. శివగంగాధర్ అమెరికాలో కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ వైస్ చైర్మన్‌గా అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. విశ్వనాథ్ కూడా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. తండ్రి అస్వస్థతకు గురయ్యారని.. పరిస్థితి విషమంగా ఉందని ఆదివారం తెలియగానే కుమారులు ఇద్దరూ అమెరికా నుంచి శ్రీకాకుళానికి బయలుదేరారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సీఎం చంద్రబాబు సంతాపం
‘మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతి నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.
నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీనియర్ నాయకుడిని కోల్పోవడం టీడీపీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
సేవలు అమూల్యమైనవి
మాజీమంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు గుండ అప్పలసూర్యనారాయణ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రానికి, సీనియర్ నేతగా తెలుగుదేశం పార్టీకి గుండ అప్పలసూర్యనారాయణ గారు చేసిన సేవలు అమూల్యమైనవి.
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్రమంత్రి
పార్టీ విధేయుడిగా..
శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గుండ అప్పలసూర్యనారాయణ. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి చివరివరకు అదే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనది. అందరితో కలివిడిగా ఉంటూ, నియోజకవర్గంలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడం చాలా బాధాకరం.
- మంత్రి అచ్చెన్నాయుడు
బాధాకరం :
మాజీమంత్రి అప్పలసూర్యనారాయణ మృతి అత్యంత బాధాకరం. విలువలతో ప్రజాసేవ చేశారు. రాజకీయాలు అంటేనే సేవ చేయడమే అనే నిర్వచనాన్ని యువతరానికి నేర్పించారు. సుపరిపాలనతో ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మహనీయులు ఆయన. రైతు సంక్షేమానికి విశేష సేవలు అందించారు.
గొండు శంకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే
సమాజానికి తీరని లోటు
శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం ప్రారంభించి.. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో నిజాయితీతో గుండ అప్పలసూర్యనారాయణ వ్యవహరించారు. మచ్చలేని ప్రజాప్రతినిధిగా చిరస్మరణీయులు. ఇటువంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్నవారి మరణం బాధాకరం. సమాజానికి తీరని లోటు. నేటి తరానికి ఆదర్శప్రాయులు. వారి కుటుంబానికి నా సానుభూతి.
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు