Share News

పాతాళ‘గంగ’

ABN , Publish Date - May 12 , 2026 | 12:49 AM

76 villages in the district fall into the dark zone ఒకప్పుడు పచ్చని పొలాలతో, సమృద్ధిగా నీటి వనరులతో కళకళలాడిన జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు పాతాళగంగ అడుగంటిపోతోంది. దశాబ్దాలుగా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడంతో పరిస్థితి ప్రమాదకస్థాయికి చేరుకుంది. ఈ విపత్కర పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది.

పాతాళ‘గంగ’
లావేరులో ఎండిపోయిన చెరువు

  • అడుగంటుతున్న భూగర్భజలాలు

  • జిల్లాలో 76 గ్రామాలు డార్క్‌ జోన్‌లోకి

  • అత్యధికంగా రణస్థలం మండలంలోనే

  • కొత్తబోర్లు, ఇసుక తవ్వకాలపై నిషేధం

  • శ్రీకాకుళం/ కలెక్టరేట్‌, మే 11(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పచ్చని పొలాలతో, సమృద్ధిగా నీటి వనరులతో కళకళలాడిన జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు పాతాళగంగ అడుగంటిపోతోంది. దశాబ్దాలుగా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడంతో పరిస్థితి ప్రమాదకస్థాయికి చేరుకుంది. ఈ విపత్కర పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. వాల్టా(ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌-2002) చట్టాన్ని ప్రయోగించి, రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని 258 గ్రామాలను ‘ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌’ (భూగర్భ జలాలను అత్యధికంగా తోడేసిన) ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో జిల్లాలోని 76 గ్రామాలు డార్క్‌జోన్‌లో ఆందోళన కలిగిస్తోంది. స్టేట్‌ లెవల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌సీ), సెంట్రల్‌ లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ (సీఎల్‌ఈజీ) క్షేత్రస్థాయిలో జరిపిన శాస్త్రీయ అధ్యయనాలు, నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఈ గ్రామాలను గుర్తించింది. ఆయా గ్రామాల్లో కొత్తబోర్లు, ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వాల్టా చట్టం సెక్షన్‌ 11(3) ప్రకారం ఈ గ్రామాల్లో ఇకపై కొత్తగా బోర్లు, బావులు తవ్వడం చట్టరీత్యా నేరం. ప్రజల, ప్రైవేట్‌ తాగునీటి అవసరాలకు ఉపయోగించే బావులు, చేతిపంపులకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఇకపై చుక్కనీరు తోడాలన్నా అనుమతులు లభించవు. నీటి వనరులను కాపాడే ఉద్దేశంతో, వాల్టా చట్టంలోని సెక్షన్‌ 27 కింద ఈ గ్రామాల్లో ఇసుక తవ్వకాలను సైతం ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.

  • ‘రణస్థలం’లోనే అత్యధికంగా

  • పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా కీలకమైన రణస్థలం మండలంలో భూగర్భజలాల దోపిడీ తీవ్రంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో గుర్తించిన 76 గ్రామాల్లో సగానికిపైగా ఈ మండలంలోనే ఉండటం గమనార్హం. దీని తర్వాత స్థానాల్లో లావేరు, జి.సిగడాం, పొందూరు మండలాలు నిలిచాయి.

  • రణస్థలం మండలంలో 46 గ్రామాల్లో ఆంక్షలు అమలుకానున్నాయి. అక్కాయపాలెం, అర్జునవలస, బంటుపల్లె, బోయపాలెం, చిల్లపేటరాజం, చిట్టివలస, దేరసం, గిరివానిపాలెం, గోసం, జగన్నాథరాజపురం, జీరుకొవ్వాడ, కొండములగం, కోష్ట, కోటపాలెం, కొట్చెర్ల, కృష్ణాపురం, మహంతిపాలెం, మరువాడ, మెంటాడ, ముక్తంపురం, నరసింహ గోపాలపురం, నారువ, నెలివాడ, పాపారావుపేట, పాతర్లపల్లె, పాతసుంద్రపాలెం, పిశిని, పైడిభీమవరం, రామచంద్రపురం, రణస్థలం, రావాడ, సంచాం, సీతంవలస, సీతారాంపురం, సూరంపేట, సూరాపుం, టెక్కలి, తెప్పలవలస, తిరుపతిపాలెం, ఉప్పివలస, వలలభరావుపేట, వరాహనరసింహపురం, వరిసం, వేల్పురయి, వెంకటరావుపేట, ఎర్రవరం గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి.

  • లావేరు మండలం(18 గ్రామాలు): అదపాక, అప్పాపురం, భరణికం, బుడతవలస, గోవిందపురం, గూడెంగొలుగుల వలస, గుమడాం, కేశవరాయపురం, కేవశరాయునిపాలెం, కొండకుంకాం, కొత్తకుంకాం, లావేరు, నాగంపాలెం, నీలాపురం, పెద్దలింగాల వలస, పోతయ్యవలస, తంవాడ, వెంటకాపురం గ్రామాలు.

  • జి.సిగడాం మండలం(6 గ్రామాలు): దళెంరాజువలస, దేవరవలస, నాయుడువలస, పున్నాం, సర్వేశ్వరపురం, ఉల్లివలస గ్రామాలు.

  • పొందూరు మండలం(6 గ్రామాలు) : బాణం, భగవాన్‌దాసుపేట, కేశవదాసుపురం, లోలుగు, నరసాపురం, పుల్లాజీపేట గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటినట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జల, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ గ్రామాల్లో నిబంధనల అమలుపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు.

  • మోగుతున్న ప్రమాద ఘంటికలు

    జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల, టెక్కలి, లావేరు, నరసన్నపేట తదితర మండలాల్లో భూగర్భజల మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. అవసరానికి మించి వినియోగం, వర్షాభావ పరిస్థితులు, చెరువుల ఆక్రమణ కారణంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలో ఏడాదికి సగటున 3.8 మీటర్ల భూగర్భజల నీటిమట్టం తగ్గిపోతోంది. అంటే గతంలో 50 అడుగుల లోతులో లభించిన నీరు.. ఇప్పుడు 80 - 100 అడుగుల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోపదేళ్లలో జిల్లాలో తీవ్ర నీటిఎద్దడి ఎదురుకానుంది. ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

  • పెరుగుతున్న బోర్లు.. ఎండుతున్న చెరువులు...

    జిల్లాలో గత పదేళ్లలో బోర్‌వెల్‌ల సంఖ్య 1.45 లక్షల నుంచి 2.48 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. ఏటా వీటి సంఖ్య వేలల్లో పెరుగుతూ వస్తోంది. వేసవి మొదలు కాగానే చెరువులు కూడా ఎండిపోతున్నాయి. 2016లో సగటు వర్షపాతం 1180 మి.మీ. ఉండగా, 2025లో అది 940 మి.మీ.లుగా నమోదు కావడం గమనార్హం. అధికారులు, నాయకులు వేసవి వస్తే ట్యాంకర్లతో ప్రజల అవసరాలను తీర్చేందుకు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. కాగా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • నీటిమట్టాలు పెరగాలంటే....

    నీటిని పొదుపుగా వినియోగించాలి. వర్షపునీరు వృథాకాకుండా.. నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టాలి. చెరువులు, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంలు, పంటల మార్పు వంటి చర్యల అమలుతో భూగర్భ జలాల రీచార్జ్‌ పనులు చేపడితే భవిష్యత్తులో నీటి ఇబ్బందుల నుండి బయటపడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

  • 100 రోజుల ప్రణాళిక

    జిల్లాలో భూగర్భజలాలు పెంచేందుకుగానూ ‘జలధార- జలహారతి’ పనులను ఇప్పటికే చేపట్టాం. ఇందుకు సంబంధించి వంద రోజుల ప్రణాళికను రూపొందించాం. ముఖ్యంగా చెరువుల పూడికతీత, ఫీడర్‌ ఛానల్స్‌ పునరుద్ధరణ, చెరువు గట్ల పటిష్టత వంటి కార్యక్రమాలతో భూగర్భజల మట్టాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని చెరువులను పూర్తిగా నింపడం ద్వారా రీచార్జ్‌ జరిగి లక్ష్యాలను చేరుకుంటాం.

    - రామారావు, భూగర్భజలవనరుల శాఖ డీడీ

Updated Date - May 12 , 2026 | 12:49 AM