నేరడి బ్యారేజీకి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:01 AM
Green signal for Vamsadhara Stage-2 works జిల్లా రైతులు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రాజెక్టుకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్-2లో అత్యంత కీలకమైన ‘నేరడి బ్యారేజీ’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేరడి బ్యారేజీతో పాటు దాని అనుబంధ పనుల నిర్మాణం కోసం రూ. 641.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు (అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్) మంజూరు చేసింది.
వంశధార స్టేజ్-2 పనులకు లైన్‌క్లియర్
రూ. 641.10 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ
కేంద్ర, రాష్ట్ర మంత్రుల హర్షం
శ్రీకాకుళం, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రాజెక్టుకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్-2లో అత్యంత కీలకమైన ‘నేరడి బ్యారేజీ’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేరడి బ్యారేజీతో పాటు దాని అనుబంధ పనుల నిర్మాణం కోసం రూ. 641.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు (అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్) మంజూరు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ (ప్రాజెక్ట్స్-1) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషన్ కుమార్ ఆదివారం జీవో ఆర్టీ 432ను అధికారికంగా జారీ చేశారు. పద్దు హెడ్ ఆఫ్ అకౌంట్(4700-01-131-11-26-530-531) కింద ఈ నిధులను కేటాయించారు.
నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ ఈ ఏడాది మే 14వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 722.10 కోట్లు అవసరమవుతాయని ఆ దస్త్రంలో పేర్కొన్నారు. దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం... ఆర్థిక శాఖ నుంచి ఈ నెల 20న ఆమోదం తీసుకుంది. అధికారులు ప్రతిపాదించిన అంచనా వ్యయంలో కోత విధించి, చివరకు రూ. 641.10 కోట్లకు మాత్రమే పరిపాలనా అనుమతులు ఇవ్వడం గమనార్హం.
ఆ నిధుల్లోనే భూసేకరణ, పరిహారం...
మరోవైపు ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిఽధులపై ఓ కఠిన షరతు విధించింది. మంజూరు చేసిన రూ. 641.10 కోట్లతోనే బ్యారేజీ నిర్మాణ పనులతో పాటు.. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, పరిహారం(ఆర్‌అండ్‌ఆర్) తదితర ఖర్చులన్నింటినీ సరిపెట్టుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో నేరడి ప్రాజెక్టు పనులకు సంబంధించి తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
సీఎం దూరదృష్టితో ముందడుగు
సీఎం చంద్రబాబు దూరదృష్టితో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ముందడుగు పడింది. బ్యారేజీ నిర్మాణానికి రూ. 641 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లలో నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది. వంశధార జలాలను పూర్తి స్థాయిలో వినియోగించి రైతులకు శాశ్వత సాగునీరు అందిస్తాం.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రణాళిక సిద్ధం
నేరడి ప్రాజెక్ట్ రెండేళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకుని.. జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తాం. స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను త్వరితగతిన మంజూరు చేయడం ఆనందంగా ఉంది.
- కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు