Share News

గ్రామకంఠం భూములు రిజిసే్ట్రషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 21 , 2026 | 11:39 PM

Grama Kantham land registrations ఏళ్ల తరబడి అదే స్థలంలో నివాసం ఉంటున్నా రిజస్ట్రేషన్లు జరగక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెబ్‌ల్యాండ్‌లో గ్రామకంఠంగా నమోదై.. ఇంటిపన్ను లేదా ఖాళీస్థలం పన్ను రశీదులు ఉంటే సంబంధిత ఆస్తికి రిజిస్ట్రేషన్‌ చేయాలని రిజిస్ర్టేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామకంఠం భూములు రిజిసే్ట్రషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

  • నిషేధిత జాబితాల్లో ఉన్నా ఓకే

  • ఆధారాల్లేకుంటే స్వీయ ధ్రువీకరణ

  • జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి

  • నరసన్నపేట, మే 21(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి అదే స్థలంలో నివాసం ఉంటున్నా రిజస్ట్రేషన్లు జరగక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెబ్‌ల్యాండ్‌లో గ్రామకంఠంగా నమోదై.. ఇంటిపన్ను లేదా ఖాళీస్థలం పన్ను రశీదులు ఉంటే సంబంధిత ఆస్తికి రిజిస్ట్రేషన్‌ చేయాలని రిజిస్ర్టేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అవి నిషేధిత జాబితాలో ఉన్నా, లేకున్నా పక్రియ పూర్తికి అవకాశం కల్పించింది. ఆధారాలు, పత్రాల్లేని వాటికి స్వీయ ధ్రువీకరణతో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగనున్నాయి. జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి కలుగనుంది.

  • జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పాతపట్నం, కోటబొమ్మాళి తదితర పట్టణాలు మేజర్‌ పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక సర్వేనెంబరుతో ఎకరా నుంచి 50 ఎకరాలకుపైగా భూమి ఉంటోంది. జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూములుగా నమోదై ఉన్నాయి. వీటికి సరైన పత్రాల్లేవు. తరతరాలుగా భూమి చేతుల్లో ఉన్నా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. క్రయవిక్రయాలు జరగక అత్యవసర సమయాల్లో మరింత అవస్థలు పడేవారు. గ్రామకంఠం భూముల రిజిస్ర్టేషన్‌ విషయంలో సబ్‌రిజిస్ర్టార్లు పలు కొర్రీలు వేసేవారు. తాజాగా ప్రభుత్వ ఉత్వర్వులతో గ్రామకంఠం భూముల రిజిస్ర్టేషన్‌కు ఇబ్బందులు తొలగనున్నాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • ఖాళీస్థలాలు, ఆస్తులు వెబ్‌ల్యాండ్‌లో గ్రామకంఠంగా నమోదైన సర్వేనెంబరు.. 22ఎ కింద ప్రభుత్వ నిషేధిత భూమలు జాబితాలో ఉందా? లేదా అనే దాంతో సంబంధం లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయనున్నారు. గ్రామకంఠం సర్వేనెంబరులో సదరు ఆస్తి లేదా ఖాళీస్థలం భాగమనే లింక్‌ డాక్యుమెంట్లు ఉన్నా సరిపోతుంది. గృహాలు, భవనాలకు లింక్‌ డాక్యుమెంట్లు లేకపోయినా, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటిపన్ను రశీదు ఉంటే.. అంగీకరించి రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక పంచాయతీల్లో ఖాళీ స్థలాలకు పన్ను ఉండదు. అలాంటి ఖాళీస్థలాలు కూడా స్వీయధ్రువీకరణపత్రంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చును. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎక్కువగా వారసత్వంగా వచ్చినవి ఉన్నాయి. వీటికి ఎటువంటి లింక్‌డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం స్ఫష్టత ఇచ్చింది. ఖాళీ స్థలానికి పన్ను రశీదులను పరిగణలోకి తీసుకోవాలని.. వీటికి అదనంగా 2023 మార్చి 31లో ఇచ్చిన సర్క్యూలర్‌లోని సూచనలకు అనుగుణంగా తగిన ధ్రువీకరణ రికార్డులను పరిశీలించి రిజిసే్ట్రషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. వారసత్వంగా సదరు ఆస్తి ఎలా వచ్చింది. 22ఏ సదరు ఆస్తి లేదని, ఆస్తి తన స్వాధీనంలో ఉండి అనుభవిస్తున్నానని, ఎటువంటి వివాదాలు లేవని, ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ ఇతర అధికారులు నుంచి సర్టిఫికెట్లు తీసుకురావాలని ఒత్తిడిచేయవద్దని, గతంలో జారీ చేసిన మార్గదర్శికాలు పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • ఉత్తర్వులు రావాల్సి ఉంది

  • ప్రభుత్వ ఆదేశాలు మేరకు గ్రామకంఠాలు,పంచాయతీ పరిధిలో 22ఏ లో ఉన్న స్థలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేస్తాం. ప్రభుత్వం నుంచి అధికారకంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

    - బసవయ్య, సబ్‌రిజిసా్ట్రర్‌, నరసన్నపేట

Updated Date - May 21 , 2026 | 11:39 PM