Share News

ఉద్యోగుల బదిలీకి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 26 , 2026 | 11:38 PM

Railway employees transfer సౌత్‌కోస్ట్‌ రైల్వే (విశాఖ)జోన్‌, విశాఖ డివిజన్‌ మార్పిడితో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ రైల్వేశాఖలో ఉద్యోగుల బదిలీకి లైన్‌క్లియర్‌ అయింది. విశాఖ, ఖుర్ధారోడ్‌ డివిజన్‌ అధికారుల సమన్వయంతో ఉద్యోగుల బదిలీ జరుపుకోవచ్చని రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది.

ఉద్యోగుల బదిలీకి గ్రీన్‌సిగ్నల్‌
పలాస రైల్వేస్టేషన్‌

  • విశాఖ రైల్వేజోన్‌, డివిజన్‌ మార్పిడి ఫలితం

  • డీఆర్‌ఎంల సమన్వయంతో స్థానచలనం ప్రక్రియ

  • జూన్‌ 1 నుంచి కోరుకున్నచోటే విధులు

  • పలాస, మే 26(ఆంధ్రజ్యోతి): సౌత్‌కోస్ట్‌ రైల్వే (విశాఖ)జోన్‌, విశాఖ డివిజన్‌ మార్పిడితో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ రైల్వేశాఖలో ఉద్యోగుల బదిలీకి లైన్‌క్లియర్‌ అయింది. విశాఖ, ఖుర్ధారోడ్‌ డివిజన్‌ అధికారుల సమన్వయంతో ఉద్యోగుల బదిలీ జరుపుకోవచ్చని రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగులు ఆప్షన్ల కోసం పరుగులు తీస్తున్నారు. జూన్‌ 1 నుంచి ఈస్ట్‌కోస్ట్‌రైల్వే(భువనేశ్వర్‌), ఖుర్ధాడివిజన్‌ (ఖుర్ధారోడ్‌)తో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ ఉన్న రైల్వేస్టేషన్లు విడిపోయి సౌత్‌కోస్ట్‌రైల్వే(విశాఖపట్నం), విశాఖ డివిజన్‌ రైల్వేశాఖలో విలీనమవుతాయి. ఉద్యోగుల బదిలీలపై ఇప్పటివరకూ సందిగ్ధం నెలకొంది. రెండు నెలల కిందటే బదిలీలపై ఆదేశాలు రాగా, ఉద్యోగులు ఆప్షన్లు ఎంచుకొని సంబంధిత పత్రాలు అందించారు. కాగా, పరిపాలన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని భావించి విశాఖ, ఖుర్ధారోడ్‌ డివిజన్‌ రైల్వే అధికారులు బదిలీలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈ నేపఽథ్యంలో ఇచ్ఛాపురం రైల్వేలో పనిచేస్తున్న రైలు విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఆందోళన చేశారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఆయన స్పందిస్తూ రైల్వేశాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. దీంతో వారు డివిజన్ల మార్పిడి కోరుకున్న ఉద్యోగులకు తక్షణమే స్థానచలనం కల్పించాలని ఆదేశించారు. ఇరు డివిజన్ల రైల్వే మేనేజర్ల సమన్వయంతో బదిలీలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఇచ్ఛాపురం, జాడుపూడి, సోంపేటరోడ్‌, బారువ, మందస, పలాస రైల్వేస్టేషన్లలో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులు విశాఖ డివిజన్‌కు, మిగిలినవారు ఖుర్ధాడివిజన్‌కు ఆప్షన్లు ఎంచుకున్నారు. వారందరూ జూన్‌ 1 నుంచి కోరుకున్న డివిజన్లలో పనిచేసే అవకాశం ఉంది.

  • ఇదిలా ఉండగా కమర్షియల్‌తోపాటు మరికొన్ని విభాగాలపై సందిగ్ధం నెలకొంది. ఎక్కువమంది బదిలీలు జరిగితే ప్రస్తుతం ఉన్న స్థానాలు ఎలా భర్తీ చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడంతో ఉన్నవారితో తాత్కాలికంగా పనిచేయించాలని రైల్వేశాఖ భావిస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారితో కొత్తరైల్వేజోన్‌లో ఉద్యోగులను నింపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా.. జూన్‌ 1 నుంచి రైల్వేడివిజన్‌, జోన్‌ మార్పిడి జరగనుండడంతో రైల్వేసిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ రైల్వేస్టేషన్లన్నీ ఒకే జోన్‌, డివిజన్‌ పరిధిలోకి రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలు ఒకే జోన్‌లో పూర్తిస్థాయి అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2026 | 11:38 PM