బుడగట్లపాలెం హార్బర్‌కు గ్రీన్‌సిగ్నల్!
ABN , Publish Date - May 01 , 2026 | 12:52 AM
State Cabinet approval జిల్లా మత్స్యకారుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘బుడగట్టపాలెం ఫిషింగ్ హార్బర్’ నిర్మాణానికి లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సవరించిన అంచనాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
రూ. 1586.69 కోట్లతో మూడు హార్బర్లకు పచ్చజెండా
సిక్కోలు మత్స్యకారుల దశాబ్దాల కలకు మోక్షం
అందుబాటులోకి రానున్న ఆధునిక ల్యాండింగ్, బెర్తింగ్ సౌకర్యాలు
శ్రీకాకుళం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా మత్స్యకారుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘బుడగట్టపాలెం ఫిషింగ్ హార్బర్’ నిర్మాణానికి లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల సవరించిన పరిపాలనా అంచనాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
పెరిగిన అంచనాలకు ఆమోదం..
జిల్లాలోని బుడగట్లపాలెంతోపాటు రాష్ట్రంలోని మరో రెండు హార్బర్ల (అనకాపల్లి జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం) నిర్మాణానికి గతంలో (ఆగస్టు 19, 2021న) ప్రభుత్వం రూ.1150.79 కోట్లతో పరిపాలనా ఆమోదం ఇచ్చింది. అయితే ప్రాజెక్టుల తాజా అవసరాలు, ఆధునిక సదుపాయాల కల్పన దృష్ట్యా ఈ మూడు హార్బర్లకు కలిపి మొత్తం సవరించిన అంచనా వ్యవయం రూ.1586.69 కోట్లకు తాజా మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు.
తీరంలో మారనున్న ముఖచిత్రం..
జిల్లాలో సుదీర్ఘ తీరప్రాతం ఉన్నప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణంతో ఈ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మత్స్యకారులకు అత్యంత అవసరమైన ఆధునిక ల్యాండింగ్, పడవలు నిలుపుకొనేందుకు (బెర్తింగ్) సురక్షితమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సముద్రంలో వేట మరింత సులభతరం అవ్వడంతో పాటు, జిల్లాలో చేపల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,530 ఫిషింగ్ నౌకలకు మద్దతు లభిస్తుంది. తద్వారా 12,700 మందికి పైగా మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉపాధి కోసం గుజరాత్, చెన్నై వంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే జిల్లా మత్స్యకారులకు బుడగట్టపాలెం హార్బర్ నిర్మాణంతో స్థానికంగానే ఉపాధి లభించనుంది. సమావేశంలో మన జిల్లాకు చెందిన రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.