‘బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్’కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:25 AM
జిల్లాలోని మత్స్యకారుల చిరకాల స్వప్నమైన ‘బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్’ నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.
- రూ.444.75 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు జారీ
- పీఎంఎంఎస్‌వై, శాస్కీ, సాగరమాల 2.0 నిధులతో నిర్మాణం
- నిలిచిపోయిన పనులకు జీవం పోసిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీకాకుళం, జూన్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మత్స్యకారుల చిరకాల స్వప్నమైన ‘బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్’ నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిర్మాణ వ్యయాన్ని సవరిస్తూ రూ.444.75 కోట్లతో నూతన పరిపాలనా అనుమతులను (రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సేంక్షన్) మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల (పోర్ట్స్) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణబాబు బుధవారం జీవో నంబర్ 15 జారీ చేశారు.
ఆగిన పనులకు మళ్లీ ప్రాణం...
రాష్ట్రంలో ఫేజ్-2 కింద బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో (2021 ఆగస్టు 19న) జీవో నంబర్ 11 ద్వారా తొలి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అయితే, అప్పట్లో ఐదు హార్బర్లకు కలిపి సింగిల్ ప్యాకేజీ కింద టెండర్లు పిలవగా.. బుడగట్లపాలెంనకు సంబంధించి పనుల పురోగతి 25 శాతం కంటే తక్కువగా ఉందన్న కారణంతో 2024 సెప్టెంబర్ 27న ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు హార్బర్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (ఏపీఎంబీ) సీఈవో విజ్ఞప్తి మేరకు స్పందించిన ప్రభుత్వం.. ప్రస్తుత 2025-26 ఎస్‌వోఆర్ ధరలకు అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ తాజా ఉత్తర్వులు వెలువరించింది.
నిధుల సమీకరణ ఇలా...
సవరించిన తాజా అంచనాల ప్రకారం బుడగట్టపాలెం ఫిషింగ్ హార్బర్‌కు ప్రభుత్వం మొత్తం రూ.444.75 కోట్లను ఆమోదించింది. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వివిధ పథకాల ద్వారా సమీకరించనున్నారు.
మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ. 444.75 కోట్లు
పీఎంఎంఎస్‌వై నిధులు : రూ. 40.00 కోట్లు
శాస్కీ నిధులు : రూ. 135.00 కోట్లు
మిగిలిన నిధులు : ఈ ప్రాజెక్టుకు అవసరమైన బ్యాలెన్స్ నిధులను ‘సాగరాల 2.0’ పథకం కింద సమకూర్చుతారు.
వెంటనే పనులు ప్రారంభించేలా ఆదేశాలు ..
ఆర్థిక శాఖ సమ్మతితో వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు వేగవంతం చేయాలని, వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. తాజా అనుమతులతో బుడగట్లపాలెంలో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది. ఈ హార్బర్ పూర్తయితే వేలాది మంది స్థానిక మత్స్యకారులకు స్వస్థలంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారనుంది.