Share News

పాతపెన్షన్‌కు ఓకే

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:10 PM

ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

పాతపెన్షన్‌కు ఓకే
థాంక్యూ సీఎం సార్‌ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే శిరీష, ఉపాధ్యాయులు

- 2004కు ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తింపు

- రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం

-ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెర

- 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల సంబరాలు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు ఉద్యోగాలు పొందిన వారికి పాతపెన్షన్‌ విధానం అమలు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దీంతో ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఫలించిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ-2003 నోటిఫికేషన్‌ నవంబరులో జారీకాగా, రాతపరీక్ష 2004 ఏప్రిల్‌లో జరిగింది. ఫలితాలు అదే ఏడాది జూన్‌ 11న వచ్చాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం అర్హులైన అభ్యర్థులను ప్రకటించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యేనాటికి 2005 ఏప్రిల్‌ వచ్చింది. ఈ డీ ఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో 416 మంది ఉపాధ్యాయులు నియమితలయ్యారు. వీరిలో ఎస్జీటీలు 240 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌లు 166 మంది ఉన్నారు. ఉద్యోగాల్లో చేరేనాటికి 2005 సంవత్సరం వచ్చిందన్న సాకుతో వీరందరికీ అప్పటి ప్రభుత్వం సీపీఎస్‌ను వర్తింపజేసింది. ఇది అన్యాయమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ , ఉద్యోగ అభ్యర్థులు ఏళ్లతరబడి నిరసనలు, ఉద్యమాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ స్థానంలో ఓపీఎస్‌ను వర్తింపజేస్తామని పలు సందర్భాల్లో హామీలైతే ఇచ్చింది కాని అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల విన్నపాలను పరిశీలించి పాతపెన్షన్‌ అమలుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉపాధ్యాయులు సంబరాలు చేసుకుంటున్నారు.


చారిత్రాత్మక నిర్ణయం

ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటాన్ని గుర్తించి మా న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్‌. ఈ నిర్ణయం చారిత్మాత్మకమైనది. ఓపీఎస్‌ను అమలు చేయానికి సహకరించిన ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఏపీఎన్టీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్‌, జిల్లా జేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరామ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

-కొత్తకోట శ్రీహరి, 2003 డీఎస్పీ ఉపాధ్యాయుల ఫోరం, జిల్లా కన్వీనర్‌, శ్రీకాకుళం

ఆనందంగా ఉంది

గతంలో ఎందరో హామీలు ఇచ్చారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఓపీఎస్‌కు అడుగులు పడటం నమ్మకం వచ్చింది. సీఎం చంద్రబాబునాయుడు ఆద్వర్యంలో మంత్రి మండలి ఓపీఎస్‌కు ఆమోదం తెలుపుతూ నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా నిలిచి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

- తండ్యాల జనర్దానరావు, ఉపాధ్యాయుడు


థాంక్యూ సీఎం సార్‌

హరిపురం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయడంపై 2004కు ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, పోలీసులు, ఉద్యోగులు బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిశారు. థాంక్యూ సీఎం సార్‌, థాంక్యూ ఎమ్మెల్యే మేడం అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకుడు సార భాస్కరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 10,715 ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.రామకృష్ణ, రామారావు, అరుణకుమారి, వందన, ప్రేమ్‌చంద్‌, శ్రీను, మోహన్‌, శంకర్‌ తదిరతులు పాల్గొన్నారు.


సీఎంకు ఉద్యోగుల కృతజ్ఞతలు

శ్రీకాకుళం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జీవో ఎంఎస్‌ నంబర్‌ 57 ప్రకారం.. 01-09-2004 కంటే ముందు నోటిఫై చేయబడి, వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింప జేయడంతో ఏపీ జేఏసీ శ్రీకాకుళం జిల్లా శాఖ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

జీవితాల్లో వెలుగులు..

గత నాలుగేళ్లుగా నిరాశలో ఉన్న వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం వెలుగులు నింపింది. పాత పెన్షన్‌ వర్తింపు, రిటైర్మెంట్‌ వయస్సు పెంపు అనేది ఏపీ జేఏసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయి. మా విన్నపాలను మన్నించి, సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబుకు జిల్లా ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ఉద్యోగుల సంక్షేమమే మా లక్ష్యం.. ఉద్యోగుల హక్కుల సాధానే మా ధ్యేయం’ అన్న నినాదంతో జేఏసీ ముందుకు సాగుతుంది.

-హనుమంతు సాయిరాం, చైర్మన్‌, ఏపీ జేఏసీ, శ్రీకాకుళం జిల్లా


సమష్టి పోరాటంతోనే..

ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, సమస్యల తీవ్రతను వివరించి ఒప్పించడంలో రాష్ట్ర జేఏసీ నాయకత్వం నూటికి నూరు శాతం సఫలమైంది. ఒకేసారి 11 వేల మందికి పైగా ఓపీఎస్‌ పరిధిలోకి రావడం సాధారణ విషయం కాదు. ఇది ఏపీ జేఏసీ అలుపెరగని పోరాటానికి, సమష్టి కృషికి దక్కిన అద్భుతమైన విజయం. ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి శ్రీకాకుళం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు.

-బి.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌, శ్రీకాకుళం జిల్లా

Updated Date - Jun 24 , 2026 | 11:10 PM