Share News

24 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:50 PM

Minister for Civil Supplies Nadendla Manohar tour ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో ధాన్యం డబ్బులు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వారి కళ్లల్లో ఆనందం చూడాలన్న ఆశయంతో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామ’ని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

24 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ
ఎఫ్‌సీఐ గోదాములో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలి

పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

గార/ శ్రీకాకుళం రూరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో ధాన్యం డబ్బులు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వారి కళ్లల్లో ఆనందం చూడాలన్న ఆశయంతో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామ’ని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సోమవారం జిల్లాలో ఆయన పర్యటించారు. పౌరసరఫరాలశాఖ ఎమ్‌డీ ఢిల్లీరావు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి గార మండలం జొన్నలపాడులోని శ్రీనివాస మోడరన్‌ రైస్‌మిల్లును ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. అనంతరం రామచంద్రాపురం రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలపై అప్పటి సీఎం జగన్‌ ఫోటోలను ముద్రించుకోవడం అన్యాయం. అందుకే వాటిని రద్దు చేసి రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి ఖాతాలకు నగదు జమ చేస్తున్నాం. ఈ విధానంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. పట్టణాల్లోని రేషన్‌ డిపోల్లో కిలో రూ.20కు గోధుమపిండి పంపిణీ చేపడుతున్నాం. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంపిణీ చేస్తామ’ని తెలిపారు.

శ్రీకాకుళం మండలంలో పలు రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. జిల్లా ఆహార సంస్థను సందర్శించారు. గోదాములో బియ్యం నిల్వలు, తేమశాతం తదితర వివరాలు తెలుసుకున్నారు. చింతాడ సమీపంలోని రైస్‌ మిల్లును కూడా పరిశీలించారు. నైరా గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మిల్లులు వద్ద సమస్యలు, బ్యాంక్‌ గ్యారంటీలు, ట్రక్‌ షీట్‌ తయారీ, పంటల దిగుబడి తదితర విషయాలపై రైతులతో చర్చించారు.

చర్యలు తప్పవు

శ్రీకాకుళం మండలం నైరాలోని చిట్టెమ్మ రైస్‌మిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో కెపాసిటీకి మించి ట్రక్‌సీట్లు నమోదు, స్టాక్‌కు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు తేలితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

నిర్మాణం పూర్తయిన పౌరసరఫరాల గిడ్డంగిని వినియోగంలోకి తీసుకురావాలని జొన్నలపాడు సర్పంచ్‌ గొలివి వెంకటరమణ మూర్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే రామచంద్రాపురం పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్‌ అంబటి చక్రధరరావు తెలిపారు. వీటిపై మంత్రి మనోహర్‌ స్పందిస్తూ.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ పృధ్వీరాజ్‌ కుమార్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సూర్యప్రకాశరావు, మేనేజర్‌ వేణుగోపాల్‌, వ్యవసాయశాఖ జేడీ త్రినాధరావు, వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ రవీంద్రబాబు, మండల వ్యవసాయ అధికారి పి.నవీన్‌, సర్పంచ్‌ రామప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:50 PM