సర్కారు బడి భేష్
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:21 AM
Many benefits in government schools ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. ఓ వైపు పాఠశాలలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. మరోవైపు విద్యార్థులకు గుణాత్మక విద్యను, ఒత్తిడిలేని చదువుకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోజనాలెన్నో
పోషకాహారం.. గుణాత్మకమైన విద్య
పుస్తకాలు, యూనిఫాం, షూస్, సాక్స్, స్కూల్‌బ్యాగ్‌లు ఉచితం
డిజిటల్ బోధన.. క్రీడలకు ప్రాధాన్యం
నరసన్నపేట, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. ఓ వైపు పాఠశాలలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. మరోవైపు విద్యార్థులకు గుణాత్మక విద్యను, ఒత్తిడిలేని చదువుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారంతోపాటు పోషకాహారం సైతం ఉచితంగా అందజేస్తోంది. బాలికలకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేసి.. వ్యక్తిగత ఆరోగ్యానికి పలు సూచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసేలా మెరుగైన బోధన అందిస్తోంది. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు క్రీడలు, యోగా వంటి వాటిపై శిక్షణ ఇస్తూ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతున్నాయి.
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
జిల్లాలో శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,652 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో గతేడాది 1,59,032 మంది విద్యార్థులు చదివారు. ఈ ఏడాది అదనంగా మరో 30 వేల మంది విద్యార్థులను చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ వేసవి సెలవుల్లో సుమారు 17వేల మంది విద్యార్థులు చేరారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో అవసరమైన వసతులను యుద్ధప్రాతిపదినక కల్పించేందుకు జిల్లాకు రూ.20కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం కేటాయించింది. వీటికితోడు పాఠశాల నిర్వహణ కమిటీలో ఉన్న మిగులు నిధులతో అవసరమైన చోట తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలకు రంగులు, రన్నీంగ్ వాటర్ సదపాయాలు కల్పించారు. పాఠశాలల్లో మూలనపడిన ఆర్వోప్లాంటును వినియోగంలో తీసుకువచ్చారు.
ప్రయోజనాలెన్నో..
ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు వరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా పుస్తకాలు, నోట్‌పుస్తకాలు,బ్యాగ్, యూనిఫాం, షూస్, సాక్స్ అందజేస్తోంది.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తోంది. ఫోర్టిఫైడ్ సన్నబియ్యంతో తయారు చేసిన అన్నం, వారానికి 5 రోజులు గుడ్లు, రాగిజావ లేదా చిక్కి వంటి పోషకాహార పదార్థాలు ఇస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనతోపాటు స్మార్ట్‌టీవీలు, డిజిటల్ కంటెంట్‌తో సాంకేతిక విద్య అందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘మనబడి- మన భవిష్యత్’ పేరుతో కొత్తతరగతి గదులు ఏర్పాటు చేశారు. డిజిటల్ క్లాస్‌రూమ్స్ కూడా సిద్ధం చేశారు.
ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు పాలీల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు.
ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పదోతరగతి మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యమిస్తారు.
పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చులు సైతం అందజేస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.6వేల వరకు ఈ సాయం అందుతోంది. అలాగే సుదూర ప్రాంత విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత కోసం బాలికా రక్షణ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ‘అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారాలు’ పేరిట ప్రోత్సాహక అవార్డులు అందజేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అర్హత కలిగిన విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వోప్లాంట్లను ఏర్పాటు చేశారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాం. నెలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. నాణ్యమైన పోషకాహారం అందజేస్తున్నాం. పిల్లలు మానసిక, శారీర వికాసం చెందే విధంగా ఒత్తిడిలేని గుణాత్మకమైన విద్యను అందిస్తున్నాం.
- ఎ.రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం
చేదోడుగా ఉంది
మా ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నాను. ఉపాధ్యాయులు చదువు బాగా చెబుతున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం అన్నీ ఉచితంగా ఇవ్వడం మాలాంటి కుటంబాలకు ఎంతో చేదోడుగా ఉంది.
- కూర్మిన సరస్వతి, రెడ్డికపేట, నరసన్నపేట మండలం
బోధన బాగుంది
మా ఇద్దరి పిల్లలను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో బోధన చాలా బాగుంది. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒత్తిడిలేని చదువులు చాలా అవసరం.
- రాడ సురేష్‌కుమార్, టీచర్, నరసన్నపేట