Share News

నరసన్నపేటలో ప్రభుత్వ భూములు కబ్జా

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:00 AM

Action against 19 officials involved in corruption ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలికారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నా వదిలేశారు. దీనిపై 2018లో ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జరిపిన విచారణలో డొంక కదలింది.

నరసన్నపేటలో ప్రభుత్వ భూములు కబ్జా

  • కంచే చేను మేసిన చందంగా రెవెన్యూ అధికారుల తీరు

  • అవినీతికి పాల్పడిన 19 మంది అధికారులపై సర్కార్‌ కొరడా

  • ఏడుగురు తహసీల్దార్లు, 12 మంది వీఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు

  • శ్రీకాకుళం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలికారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నా వదిలేశారు. దీనిపై 2018లో ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఫిర్యాదుల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జరిపిన విచారణలో డొంక కదలింది. ఈ భూ కుంభకోణంలో విధులను నిర్లక్ష్యం చేసి అవినీతికి పాల్పడినట్లు రెగ్యులర్‌ ఎంక్వైరీలో తేలడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు తహసీల్దార్లు, 12 మంది వీఆర్వోలపై (మొత్తం 19 మంది) రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీరందరిపై శాఖాపరమైన విచారణకు (డిపార్ట్‌మెంటల్‌ ప్రొసీడింగ్స్‌) ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం వేర్వేరుగా 19 జీవోలు జారీ చేశారు.

  • ఆక్రమణలు జరిగింది ఇక్కడే..

  • ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ 2024 సెప్టెంబరు 24, 2025 ఏప్రిల్‌ 17 తేదీల్లో సమర్పించిన నివేదికల ప్రకారం.. నరసన్నపేట మండలం బొరిగివలస, గొట్టిపల్లి గ్రామాల్లో భారీగా భూ ఆక్రమణలు జరిగాయని తేలింది. బొరిగివలస సర్వే నెం. 18-1లోని 5 సెంట్ల ప్రభుత్వ భూమిని భైరి రామారావు అనే వ్యక్తి ఆక్రమించారు. గొట్టిపల్లి - 2 క్లస్టర్‌ పరిధిలో సర్వే నెం. 96-1 లోని 2 సెంట్ల భూమిని రవి ప్రసాద్‌ ఆక్రమించారు. గొట్టిపల్లి-1 క్లస్టర్‌లోని సర్వే నెం. 103-2లో 5.65 సెంట్లను ఏకంగా 23 మంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు. గొట్టిపల్లి-3 క్లస్టర్‌లోని సర్వే నెం. 187లో 74 సెంట్ల భూమిని 28 మంది వ్యక్తులు ఆక్రమించుకున్నారు.

  • చర్యలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు

  • జల్లేపల్లి రామారావు (రిటైర్డ్‌ తహసీల్దార్‌), యల్లంపల్లి శ్రీనివాసరావు (మాజీ తహసీల్దార్‌, ప్రస్తుతం అచ్యుతాపురం తహసీల్దార్‌), సనపల సుధాసాగర్‌ (మాజీ తహసీల్దార్‌, ప్రసుత్తం పాతపట్నం తహసీల్దార్‌), పొదిలాపు శ్రీనివాసరావు (మాజీ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌), మంగిపూడి సురేష్‌ కుమార్‌ (మాజీ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌), విల్లూరి వెంకటరమణ (మాజీ తహసీల్దార్‌), కూర్మాన ప్రవళ్లిక ప్రియ (మాజీ తహసీల్దార్‌, ప్రస్తుతం అచ్యుతాపురం తహసీల్దార్‌)

  • చర్యలు ఎదుర్కొంటున్న వీఆర్వోలు

  • ఎన్‌ జ్ఞానేశ్వరరావు (రిటైర్డ్‌ వీఆర్వో-గొట్టిపల్లి), కొరికాన కోటేశ్వరరావు (మాజీ వీఆర్వో - బొరిగివలస-ప్రస్తుతం పోలాకి రీ-సర్వే డీటీ), జల్లా శ్రీనివాసరావు (మాజీ వీఆర్వో-బొరిగివలస), మెండ శ్రీనివాసరావు (మాజీ వీఆర్వో-బొరిగివలస), ఎం.సంధ్య (మాజీ వీఆర్వో, బొరిగివలస), తోట లక్ష్మణరావు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-1), చౌదరవి వెంకట చక్రవర్తి (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-1), బానాల మురళీ కృష్ణ నాయుడు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-2), బన్న శ్యామసుందరరావు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-2), ఉంకిలి చిన్న వెంకటరావు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-2), లుకలాపు శ్రీనివాసరావు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-3), బెహరా వెంకటరామ విశ్వేశ్వరరావు (మాజీ వీఆర్వో, గొట్టిపల్లి క్లస్టర్‌-3)

  • పది రోజుల్లో వివరణ ఇవ్వాలి

  • 1905 ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం కింద ప్రభుత్వ భూములను రక్షించడంలో పూర్తిగా విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైర్ట్‌ అయిన ఇద్దరు అధికారులపై (జల్లేపల్లి రామారావు, ఎన్‌ జ్ఞానేశ్వరరావు) ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌ 1980 లోని రూల్‌ 9 కింద కఠిన చర్యలకు ఆదేశించింది. విధుల్లో ఉన్న మిగతా 17 మంది అధికారులపై ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ 1991 లోని రూల్‌ 20 ప్రకారం మేజర్‌ పెనాల్టీ కోసం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందిన 10 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణను సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వారు వివరణ ఇవ్వని పక్షంలో, నేరాన్ని అంగీకరించినట్లుగా (ఎక్స్‌పార్టీగా) భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణను ప్రభావితం చేసేలా రాజకీయ లేదా ఇతర వ్యక్తుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తే కాండక్ట్‌ రూల్స్‌లోని రూల్‌ 24 కింద అదనపు చర్యలు తప్పవని జీవోల్లో ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Updated Date - Aug 06 , 2026 | 12:00 AM