Share News

కోటబొమ్మాళికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:08 AM

Classes start from next academic year జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాళిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.

కోటబొమ్మాళికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభం

తాత్కాలికంగా జూనియర్‌ కాలేజీలో నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం

సిబ్బంది నియామకానికి, పోస్టుల సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్‌

విద్యార్థులకు తీరనున్న దూరాభారం

శ్రీకాకుళం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాళిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచే తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పక్కా భవనాలు సిద్ధమయ్యేలోపు, ప్రస్తుతం కోటబొమ్మాళిలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలోనే తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.

సిబ్బంది సర్దుబాటు ఇలా...

నూతన కళాశాలకు అవసరమైన బోధనా సిబ్బందిని జోన్‌-1 పరిధిలోని ఇతర 11 డిగ్రీ కళాశాలల్లో ఉన్న 16 మిగులు(సర్‌ప్లస్‌) పోస్టుల నుంచి ఇక్కడికి బదిలీ చేయనున్నారు. రెండు నాన్‌-టీచింగ్‌ పోస్టులను కూడా జోన్‌-1 నుంచే బదిలీ చేస్తారు. కళాశాల నిర్వహణ కోసం 9మంది నాన్‌-టీచింగ్‌ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించేందుకు, ప్రిన్సిపాల్‌ బాధ్యతలను ఎఫ్‌ఏసీ పద్ధతిలో అప్పగించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

కోటబొమ్మాళితోపాటు మండల పరిసర విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదవాలంటే టెక్కలి, పలాస, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది. దూరభారంతో ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో గురువారం కోటబొమ్మాళి లోని ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు పార్కులో టాపాసులు కాల్చి సందడిచేశా రు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

2014-19 మధ్యకాలంలో కోటబొమ్మాళిలో డిగ్రీ కళాశాలను మంజూరు చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంత వైసీపీ నాయకులు ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరం లేదని.. అప్పటి ఉన్నతాధికారులను తప్పుదోవపట్టిస్తూ ఏకపక్షంగా కళాశాలను రద్దు చేయించారు. 2024 ఎన్నికల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చాం. ఉన్నత విద్యకు పల్లె వాసులు దూరం కాకూడదు. అందరికీ విద్య.. అందరికీ బాధ్యత అన్న నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు.

- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Updated Date - Jan 09 , 2026 | 12:08 AM