Share News

‘సృష్టి’ అక్రమాలపై సర్కారు కొరడా

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:29 PM

Action against three government doctors సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లోని కొన్నాళ్ల కిందట జరిగిన చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రభుత్వ వైద్యులపై ఉమ్మడి క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం జీవో ఆర్టీ నెంబర్‌ 218 జారీ చేసింది.

‘సృష్టి’ అక్రమాలపై సర్కారు కొరడా

ముగ్గురు ప్రభుత్వ వైద్యులపై ఉమ్మడి క్రమశిక్షణా చర్యలు

గైర్హాజరుపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

వేర్వేరుగా జీవోలు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

శ్రీకాకుళం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లోని కొన్నాళ్ల కిందట జరిగిన చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రభుత్వ వైద్యులపై ఉమ్మడి క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం జీవో ఆర్టీ నెంబర్‌ 218 జారీ చేసింది. ఇందులో శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలకు(రిమ్స్‌) చెందిన చిన్నపిల్లల వైద్యురాలు అరిమిల్లి విద్యుల్లత కూడా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో, విధులకు అనధికారికంగా గైర్హాజరైన వ్యవహారంలో ఆమెపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ జీవో ఆర్టీ నెంబర్‌ 221ను కూడా ప్రభుత్వం వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఈ ఉత్తర్వులు జారీచేశారు.

డీఎంఈ కార్యాలయం సమర్పించిన నివేదిక ఆధారంగా శ్రీకాకుళం రిమ్స్‌లోని పిడియాట్రీషియన్‌ డాక్టర్‌ ఏ.విద్యుల్లతతోపాటు.. విశాఖ ఆంధ్రా మెడికల్‌ కాలేజీ అనస్థీషియాలజీ ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్‌ వాసుపల్లి రవి, ఓబీజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పులుమూరు ఉషాదేవిపై ఏపీ సివిల్‌ సర్వీసెస్‌(సీసీ అండ్‌ ఏ) రూల్స్‌-1991 కింద ఉమ్మడి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. రూల్‌ 9 కింద వీరిపై కఠిన చర్యలు విధించే పూర్తి అధికారం క్రమశిక్షణా అధికారిగా వ్యవహరించే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఉంటుంది.

పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలి

సృష్టి ఆస్పత్రి వ్యవహారంతోపాటు, విధులకు అనధికారికంగా గైర్హాజరైన కారణంతో శ్రీకాకుళం మెడికల్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏ విద్యుల్లతపై ప్రభుత్వం సీసీఏ రూల్‌-20 కింద అభియోగాలు నమోదు చేసింది. దీనికి సంబంధించి చార్జ్‌ మెమో, సాక్షుల జాబితా, ఆధారాలను జత చేసింది. అభియోగాలపై పది రోజుల్లోగా రాతపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు ఏకపక్షంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.

పైరవీలు చేస్తే చర్యలు తప్పవు

ఈ వ్యవహారంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఉన్నతాధికారులపై రాజకీయంగా లేదా ఇతర బాహ్య ఒత్తిళ్లు తీసుకురావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఒకవేళ ఇతరుల ద్వారా పైరవీలు చేసినా లేదా ఆమె తరపున ఎవరైనా ప్రాతినిథ్యం వహించినా.. అది ఆమె ప్రోద్బలంతోనే జరిగినట్లుగా భావించి ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (కండక్ట్‌) రూల్స్‌-1964 లోని రూల్‌ 24 ఉల్లంఘన కింద పరిగణించి మరింత కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Mar 09 , 2026 | 11:29 PM