గొట్టాబ్యారేజీ నీరు వృథా
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:49 PM
249 cusecs into the sea ఎల్‌నినో ప్రభావంతో ఓపక్క వర్షాల జాడలేక రైతులు అల్లాడిపోతుంటే మరోపక్క అధికారుల అనాలోచిత నిర్ణయాల మూలంగా గొట్టాబ్యారేజీ నుంచి 249 క్యూసెక్కుల సాగునీరు సముద్రంలోకి వృథాగా పోతుంది. వాస్తవానికి ఎడమకాలువ వెంబడి 2 వేల క్యూసెక్కుల సాగునీరు విడిచిపెట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు.
సముద్రంలోకి 249 క్యూసెక్కులు
వంశధార ఎడమ, కుడి కాలువ ద్వారా పూర్తిస్థాయిలో రాని నీరు
చెరువులు నింపుకొనే అవకాశానికి దూరం
ఆందోళన చెందుతున్న రైతులు
టెక్కలి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఓపక్క వర్షాల జాడలేక రైతులు అల్లాడిపోతుంటే మరోపక్క అధికారుల అనాలోచిత నిర్ణయాల మూలంగా గొట్టాబ్యారేజీ నుంచి 249 క్యూసెక్కుల సాగునీరు సముద్రంలోకి వృథాగా పోతుంది. వాస్తవానికి ఎడమకాలువ వెంబడి 2 వేల క్యూసెక్కుల సాగునీరు విడిచిపెట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. కానీ, వారు మాత్రం గొట్టా బ్యారేజీ నుంచి ఆదివారం సాయంత్రం ప్రధాన ఎడమ కాలువ ద్వారా 1,722 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 220 క్యూసెక్కులు మాత్రమే విడిచి పెట్టారు. ప్రస్తుతం గొట్టాబ్యారేజీకి 2,110 క్యూసెక్కుల నీరు వస్తుండగా 38.10 ఎఫ్‌ఆర్‌ఆల్ (పూర్తిస్థాయి నీటిమట్టం)కు పరిమితం చేశారు. అయితే, ఎడమ, కుడి కాలువల్లోకి కొంత నీరు విడిచిపెట్టి, సముద్రంలోకి 249 క్యూసెక్కులను వృథాగా విడిచిపెట్టడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎడమ కాలువ పరిధిలో హిరమండలం మొదలుకొని పలాస, వజ్రపుకొత్తూరు చివరి వరకు లక్షా48వేల250 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 80శాతం మంది రైతులు వరి ఎదలు వేశారు. అయితే, వర్షాలు లేక వంశధార సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రంలోకి వృథాగా విడిచిపెడుతున్న 249 క్యూసెక్కులను కూడా ఎడమ, కుడి కాలువల ద్వారా పంపిస్తే చెరువులు నింపుకొంటామని రైతులు చెబుతున్నారు. కాగా, ఎడమ కాలువ వెంబడి మొదటి 50 కిలోమీటర్ల లోపు పూర్తిస్థాయి పూడికలు తొలగించకపోవడంతో సాగునీటికి కొంత అడ్డంకిగా మారింది.
పూడికతీత పనులు చేయలే!
ఐదు దశాబ్దాలుగా ఎడమ కాలువలో పూడికతీత పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. పలుచోట్ల కాలువలపై షట్టర్లు లేవు. యూటీ మరమ్మతులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడమ, కుడి కాలువలకు సంబంధించి చిన్నచిన్న పనులను ముందుగా చేయకుండా, నీరు విడిచిపెట్టే సమయంలో చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ఎడమ కాలువ వెంబడి సాగునీరు కిందకు రావాలనే ఉద్దేశంతో మంత్రి అచ్చెన్నాయుడు ఆపరేషన్ అండ్ మెంటెనెన్స్ గ్రాంట్ కింద టెక్కలి నియోజకవర్గానికి రూ.3కోట్లు ఇచ్చారు. ఈ నిధులను మేజర్ ఇరిగేషన్‌కు కేటాయించారు. దీనివల్ల పనులు జరగడంతో ఈనెల 5న విడిచిపెట్టిన సాగునీరు ఆదివారం నాటికే పలాసకు చేరుకుంది. పూర్తిస్థాయి సాగునీరు విడిచిపెడితే 24 నరసన్నపేట బ్రాంచ్ కెనాల్‌కు, 25 మేఘవరం కెనాల్‌కు కొంత ఉపయోగపడుతుంది. ప్రస్తుతం టెక్కలి ప్రాంతానికి 550 క్యూసెక్కులు రావడంతో మదనగోపాలసాగరంలో జలకళ సంతరించుకుంది. టెక్కలి నుంచి పలాస, వజ్రపుకొత్తూరు చివరి వరకు 50 క్యూసెక్కులకు పైగా సాగునీరు వెళ్లడంతో అక్కడ ప్రజాప్రతినిధులు, రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆదివారం జలహారతి కార్యక్రమం కూడా నిర్వహించారు.
వృథా కాకుండా చూస్తాం
ప్రధాన ఎడమ కాలువలో 6, 16 కిలోమీటర్ల వద్ద మరమ్మతులు జరిపించాం. ఆర్‌ఎంసీకి సంబంధించి లిఫ్ట్ దగ్గర గ్రాస్‌బండ్ పనుల మూలంగా పూర్తిస్థాయి నీరు విడిచిపెట్టలేదు. సోమవారం నాటికి కుడి, ఎడమ కాలువల వెంబడి పూర్తిస్థాయి సాగునీటిని తెచ్చి, సముద్రంలోకి వృథాగా నీరు వెళ్లకుండా నిలుపుదల చేస్తాం.
-జి.రామచంద్రరావు, వంశధార ఎస్‌ఈ