ధర భళా.. సాగు డీలా
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:23 PM
ఈ ఏడాది మిర్చి ధరలు బాగున్నా సాగుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పుచ్చ కాయలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలపై ఆసక్తిచూపుతున్నారు.
- జిల్లాలో తగ్గిన మిరప పంట
- కూరాకుల రకం మిర్చి ధర కిలో రూ.300
- అయినా సాగుకు ముందుకురాని రైతులు
- ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మిర్చి ధరలు బాగున్నా సాగుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పుచ్చ కాయలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలపై ఆసక్తిచూపుతున్నారు. ఈ కారణంగా జిల్లాలో మిర్చి దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో గుంటూరు వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు జిల్లాలో మిరప పంట కనుమరుగయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో లావేరు, వెంకటాపురం, రణస్థలం, పైడిభీమవరం తదితర ప్రాంతాల్లో కూరాకుల మిర్చి, గార, లబ్బోడిపేట, ఇప్పిలి, కొయ్యానపేట, పోలాకి, వెదుళ్లవలస, డోల, లంకపేట, సుగ్గు అగ్రహారం, శాలిహుండాం, కళింగపట్నం, తదితర ప్రాంతాల్లో సారూ మిర్చి సాగుచేస్తున్నారు. నరసన్నపేట ప్రాంతంలో పచ్చి మిర్చి సాగునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడి నుంచి పచ్చిమిర్చి విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది కొత్తగా జీ-5 రకం మిర్చిని కొన్ని ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. అయితే, జిల్లాలో మిర్చి సాగు రానురానూ బాగా తగ్గిపోతుంది. ధరలు నిలకడగా ఉండకపోవడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న, పత్తి, పుచ్చకాయలు తదితర పంటల సాగుపై దృష్టిసారిస్తున్నారు. లావేరు, రణస్థలం మండలాల్లో రెండు మూడేళ్ల కిందట వరకు మిర్చి సాగు చేసిన రైతులు ఇప్పుడు సుమారు 200 ఎకరాల్లో పుచ్చకాయలు సాగుచేస్తున్నారు. సాధారణంగా మిర్చి దిగుబడి జనవరి నెలలో రావల్సిఉంది. ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెల ప్రవేశించి 10 రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది విపరీతమైన మంచు ప్రభావం, ఎర్ర తెగులు కారణంగా దిగుబడి తగ్గడమే కాకుండా, ఆలస్యంగా పంట చేతికి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. గతేడాది కురిసిన అకాల వర్షాలతో మిర్చి సాగులో జాప్యం జరిగినట్టు ఉద్యానశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.
కిలో రూ.300..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధరలు బాగా పెరిగాయి. కూరాకుల మిర్చి కిలో 2024లో రూ.200, 2025లో రూ.150, ప్రస్తుతం రూ.300 పలుకుతుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ట్రేడర్లు చెబుతున్నారు. రూ.400 మించి పెరిగినా ఆశ్చర్యపోవల్సిన పనిలేదంటున్నారు. జిల్లాలో జీ-5 రకం కిలో రూ.230కు విక్రయిస్తున్నారు. మిరప పళ్లు కిలో రూ.55కు అమ్ముతున్నారు. గుంటూరులో కూడా మిర్చి ధర కిలో రూ.300 పలుకుతుంది.
కొనుగోలు కేంద్రాలు వెలవెల..
జిల్లాలో ఒకప్పుడు చిలకపాలెంలో 4, పొందూరులో 8 మిర్చి కొనుగోలు కేంద్రాలు ఉండేవి. ఈ సీజన్లో అవి కళకళలాడుతుండేవి. ప్రస్తుతం జిల్లాలో మిర్చి దిగుబడి విపరీతంగా తగ్గడం, ఎగుమతికి అవకాశం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు దిగాలు పడ్డాయి. ఈ ఏడాది కొనుగోలు అంతంత మాత్రంగానే ఉన్నాయ. మరోపక్క పురుగు మందుల వినియోగంతో మిర్చి నాణ్యత బాగా తగ్గుతోంది. ఈ కారణంగా కోల్డ్ స్టోరేజిలో నిల్వకు పనికిరాకుండా ఉంది. నిల్వ ఉంచితే మిర్చి రంగు మారిపోతోంది. దీనివల్ల నిల్వ చేసేందుకు ట్రేడర్లు కూడా ఇబ్బందిపడుతున్నారు.
సాగునకు ఇబ్బందే
కొన్నేళ్లుగా మిరప పంటను సాగు చేస్తున్నా. ఇది చాలా ఖర్చుతో పాటు శ్రమతో కూడిన పని. విపరీతమైన మంచు ప్రభావం, అకాల వర్షాలు, తెగుళ్లతో ఈ ఏడాది ఇప్పటికీ పంట దిగుబడి రాలేదు. వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా కనీసం పెట్టుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది.
- తంగి మల్లేశ్వరరావు, రైతు, తంగివానిపేట
వ్యాపారం బాగా తగ్గింది
చిలకపాలెం, పొందూరు కేంద్రంగా గతంలో మిర్చి వ్యాపారం బాగా జరిగేది. రైతులు ఇతర పంటలపై ఆసక్తి చూపడంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. దీంతో వ్యాపారం బాగా తగ్గిపోయింది. సుమారు పదేళ్లుగా మిర్చి సాగు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మిర్చి మార్కెట్లోకి రాలేదు.
- ఆట్ల శేషగిరిరావు, ట్రేడర్, చిలకపాలెం