ఎట్టకేలకు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:31 AM
Refund of money paid for Tidco homes టిడ్కో (టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) గృహ దరఖాస్తుదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించనుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించిన డీడీలకు సంబంధించిన నగదు వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
టిడ్కో గృహ దరఖాస్తుదారులకు శుభవార్త
కట్టిన డబ్బులు వాపసు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు
పలాస, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): టిడ్కో (టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) గృహ దరఖాస్తుదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించనుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించిన డీడీలకు సంబంధించిన నగదు వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇన్నాళ్లూ ఇళ్లు లేక.. కట్టిన డబ్బులు తిరిగిరాక ఆందోళన చెందిన దరఖాస్తుదారులకు ఎనిమిదేళ్ల తర్వాత ఊరట లభించనుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017-18 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధి పాత్రునివలస, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో టిడ్కో ఇళ్లు నిర్మించారు. టాటా, నాగార్జున, నవయుగ వంటి బడా కంపెనీలకు గృహ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దరఖాస్తులను స్వీకరించింది. లబ్ధిదారులు డీడీ రూపంలో కొంత నగదు చెల్లించి, మిగిలింది బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అప్పట్లో లబ్ధిదారులు రూ.500, రూ.50వేలు, రూ.లక్ష చొప్పున డీడీలను తీసి అధికారులకు అందజేశారు. జిల్లాలో మొత్తం 3,536 గృహాలకుగానూ 2,912 ఇళ్లను అధికారులు పూర్తిచేశారు. ఈలోగా 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్మాణాలను నిలిపేసింది. అప్పటివరకూ పూర్తయిన గృహాలను మాత్రమే లబ్ధిదారులకు అందించి.. మిగిలిన వారికి డీడీల రూపంలో కట్టిన నగదును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. నగదు తీసుకున్నవారికి బదులుగా సెంటు స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఐదేళ్లలో డబ్బులు ఇవ్వలేదు. స్థలాలు కూడా ఇవ్వలేదు.
2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఇళ్లు లేకపోయినా తాము కట్టిన నగదు అయినా ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరారు. దీనిపై ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. టిడ్కో దరఖాస్తుదారులకు నగదు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రోజుల కిందట మార్గదర్శకాలను జారీచేసింది. లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 1,056 మందికి రూ.4.17 కోట్లు, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో రూ.76 లక్షలు అందజేయనున్నారు. అన్ని పట్టణాల్లోనూ 3వేల మందికి ప్రజాప్రతినిధుల ద్వారా త్వరలో చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పలాస-కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులను వివరణ కోరగా ‘ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. లబ్ధిదారుల వివరాలు, వారు కట్టిన డీడీల జాబితా ప్రభుత్వానికి నివేదించాం. రెండు రోజుల్లో వారికి నగదు జమ చేస్తామ’ని తెలిపారు.