Share News

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:13 AM

జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు

-డైట్‌ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

- ఈ నెల నుంచే అమలు చేయాలని ఆదేశం

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ల డైట్‌ చార్జీలను పెంచింది. వీటిని ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 158 వసతిగృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో 25,030 మంది విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వంలో డైట్‌ చార్జీలు సక్రమంగా అందక, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 3 నుంచి 4వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1150గా ఉన్న డైట్‌ చార్జీని రూ.1265కు, 5 నుంచి 10వ తరగతి వారికి రూ.1400 నుంచి రూ.1540కు పెంచింది. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.1600గా ఉన్న మొత్తాన్ని రూ.1760కు పెంచింది. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందనుంది.

Updated Date - Oct 08 , 2026 | 12:13 AM