ఆర్జీయూకేటీ ఐటీ మెంటార్లకు శుభవార్త!
ABN , Publish Date - May 13 , 2026 | 12:14 AM
'Minimum time scale' for 44 people ట్రిపుల్ ఐటీ (ఆర్జేయూకేటీ) క్యాంపస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఐటీ మెంటార్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగంలో మొత్తం 44 మంది మెంటార్లకు మినిమమ్ టైమ్ స్కేల్(ఎంటీఎస్) వర్తింపజేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం జీవో జారీ చేసింది.
శ్రీకాకుళం సహా నాలుగు క్యాంపస్‌ల్లోని 44 మందికి ‘మినిమమ్ టైమ్ స్కేల్’
జూనియర్ లెక్చరర్లతో సమానంగా బేసిక్ పే అమలు
ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
శ్రీకాకుళం, మే 12(ఆంధ్రజ్యోతి): ట్రిపుల్ ఐటీ (ఆర్జేయూకేటీ) క్యాంపస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఐటీ మెంటార్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగంలో మొత్తం 44 మంది మెంటార్లకు మినిమమ్ టైమ్ స్కేల్(ఎంటీఎస్) వర్తింపజేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో శ్రీకాకుళం క్యాంపస్‌తోపాటు నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) ప్రాంగణాల్లో పనిచేస్తున్న వారికి ప్రయోజనం కలగనుంది. వీరంతా 2008-09, 2009-10 విద్యా సంవత్సరాల్లో తొలుత హెచ్‌ఆర్‌టీఎస్ (హోమ్ రూమ్ ట్యూటర్స్)గా విధుల్లో చేరారు. తర్వాత ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వీరందరినీ ఐటీ మెంటార్లుగా రీ-డెసిగ్నేట్ చేసింది. కాగా.. తమకు మినిమమ్ టైమ్ స్కేల్ చెల్లించాలని కోరుతూ ఏ.శేషుకుమార్‌తోపాటు మరో 43 మంది కొన్నాళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. వీరికి ఎంటీఎస్ చెల్లించాల్సిందిగా 2023 మార్చి 10న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేస్తూ ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
జూనియర్ లెక్చరర్లతో సమానంగా...
కోర్టు ఆదేశాల మేరకు ఈ 44 మంది మెంటార్లకు జూనియర్ లెక్చరర్లుకు ఇస్తున్న బేసిక్ పే ఆధారంగా ఎంటీఎస్ అమలు చేయనున్నారు. ట్రిపుల్ ఐటీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు మంజూరు కాకపోవడంతో.. ఆ పోస్టులతో సమానంగా ఎంటీఎస్ ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం.. కొత్తపోస్టులు అవసరం లేకుండానే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎంటీఎస్ ఇవ్వడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
ఈ మినిమమ్ టైమ్‌స్కేల్ జీవో జారీ అయిన తేదీ నుంచి వర్తిస్తుంది. క్యాంపస్ క్వార్టర్స్ ఖాళీ చేసిన పది మందికి ఎలాంటి కోతలు లేకుండా పూర్తి ఎంటీఎస్ అమలవుతుంది. హాస్టళ్లలో కొనసాగుతున్న వారికి, వారు చెల్లించాల్సిన అద్దెను మినహాయించుకుని మిగతా ఎంటీఎస్ మొత్తాన్ని ఇస్తారు. ఈ ప్రభుత్వ నిర్ణయం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుంది. ఎంటీఎస్ మంజూరు చేసినంత మాత్రాన భవిష్యత్తులో ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఎలాంటి హక్కు ఉండదని, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో శ్రీకాకుళం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో పనిచేస్తున్న ఐటీ మెంటార్లకు ఆర్థికంగా ఊరట లభించనట్లయింది.