రైల్వే ప్రయాణికులకు తీపికబురు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:55 PM
Halting of three express trains జిల్లా రైల్వే ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లాలోని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఫలించింది.
తిలారు, ఇచ్ఛాపురం, బారువ స్టేషన్లలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్
ఫలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి
శ్రీకాకుళం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లా రైల్వే ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లాలోని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి కష్టాలను తీర్చేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఫలించింది. జిల్లాలో కీలకమైన తిలారు, ఇచ్ఛాపురం, బారువ రైల్వేస్టేషన్లలో మూడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ (హాల్ట్) కల్పిస్తూ రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బెర్హంపూర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18525/18526) ఇకపై తిలారులో ఆగుతుంది. అలాగే పూరి - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12843/12844)కు ఇచ్ఛాపురంలో హాల్ట్ కల్పించారు. భువనేశ్వర్ - న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22819/22820) బారువ స్టేషన్‌లో ఆగుతుంది. ఈ రైళ్ల నిలుపుదల త్వరలోనే అమల్లోకి రానుందని.. ప్రయాణికుల ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రైల్వేమంత్రికి కృతజ్ఞతలు
జిల్లావాసుల ఇబ్బందులను గమనించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గతంలో రైల్వే సమీక్షా సమావేశాల్లోనే ఈ హాల్టుల ఆవశ్యకతను అధికారులకు స్పష్టం చేశారు. అలాగే న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రాన్ని కూడా అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రి వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రైళ్ల హాల్టింగ్ సౌకర్యం కల్పనకు కృషి చేసిన కేంద్రమంత్రికి జిల్లావాసులు ధన్యవాదాలు తెలిపారు.