Share News

జీడి రైతులకు తీపికబురు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:45 PM

జీడి రైతులకు రాష్ట్ర ఉద్యానవనశాఖ తీపి కబురు చెప్పింది.

 జీడి రైతులకు తీపికబురు

- బీమా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

- ఎకరాకు రూ.1,500 నుంచి రూ.1,600 ప్రీమియం చెల్లించాలి

- జిల్లాలో 42వేల హెక్టార్లలో తోటలు

టెక్కలి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జీడి రైతులకు రాష్ట్ర ఉద్యానవనశాఖ తీపి కబురు చెప్పింది. 2026-27 సంవత్సరానికి గాను జీడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తెగుళ్లు, పొగమంచు, ఇతర సమస్యల మూలంగా పంట నష్టపోతే పరిహారం చెల్లిస్తామని భరోసా కల్పించింది. దీంతో జీడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 42 వేల హెక్టార్లలో జీడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన కింద ఎకరా జీడితోటకు రైతులు కేవలం రూ.1,500 నుంచి రూ.1,600 వరకు ప్రీమియంను ఈ నెల 15లోగా చెల్లించాలి. బీమా చేసేందుకు ఈ సంవత్సరం టోక్యో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకు వచ్చింది. ఫసల్‌ బీమా యోజన యాప్‌ ద్వారా, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా బీమా ప్రీమియం చెల్లించేందుకు రైతులకు అవకాశం ఇచ్చారు. 1బీతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, సెల్‌ఫోన్‌ నెంబరు, ఫొటో వంటివి అందించాల్సి ఉంటుంది. బీమాను సద్వినియోగం చేసకోవడం ద్వారా రైతులు పెద్దఎత్తున లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై ఉద్యానవనశాఖ అధికారి చింతాడ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ‘జీడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమాపై అవగాహన కల్పిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈనెల 15లోగా ప్రీమియం చెల్లించాలి.’అని తెలిపారు.

అవగాహన కల్పించాలి..

బీమాపై జీడి రైతులకు అవగాహన కల్పించాలి. ఉద్యానవనశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టాలి. గడువు సమీపిస్తున్నా ఉద్యానవనశాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఏ మేరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తారన్నది అధికారులు వెల్లడించాలి.

- గుజ్జూరు సత్యం, టెక్కలి

Updated Date - Nov 06 , 2026 | 11:45 PM