పల్లెపోరుకు సై
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:47 PM
జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఫైనల్ గెజిట్ విడుదల చేశారు.
ఖరారైన రిజర్వేషన్లు
910 పంచాయతీలు, 8,638 వార్డులకు గెజిట్ విడుదల
మూడు విడతల్లో ఎన్నికలు.. 8,674 పోలింగ్ కేంద్రాలు
సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకే పెద్దపీట
శ్రీకాకుళం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఫైనల్ గెజిట్ విడుదల చేశారు. జిల్లాలోని 910 పంచాయతీలు, 8,638 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు సమరానికి సిద్ధమవుతున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
సర్పంచ్ స్థానాల్లో మహిళలకు 448
జిల్లాలోని 910 సర్పంచ్ స్థానాల్లో మహిళలకు 448 కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా అన్‌రిజర్వ్‌డు స్థానాలు 529 (మహిళలు 262, జనరల్ 267), బీసీ 318 (మహిళలు 159, జనరల్ 159), ఎస్సీ 48 (మహిళలు 21, జనరల్ 27), ఎస్టీ 15 (మహిళలు 6, జనరల్ 9) ఉన్నాయి.
వార్డుల్లోనూ మహిళలదే పైచేయి
జిల్లాలోని 8,638వార్డు స్థానాల్లో మహిళలకు 4227 కేటాయించారు. అన్‌రిజర్వ్‌డు స్థానాలు 4248 (మహిళలు 2265, జనరల్ 1983), బీసీ 3200 (మహిళలు 1608, జనరల్ 1592), ఎస్సీ 706 (మహిళలు 196, జనరల్ 506), ఎస్టీ 484 (మహిళలు 208, జనరల్ 276) ఉన్నాయి.
మూడు విడతల్లో పోలింగ్
జిల్లాలోని 30 మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 8674 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
మొదటి విడత: ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల్లో 184 కేంద్రాలు
రెండో విడత: జలుమూరు, నరసన్నపేట, పోలాకి, సారవకోట, హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, మెళియాపుట్టి, పాతపట్నం, గార, శ్రీకాకుళం మండలాల్లో 3248 కేంద్రాలు.
మూడో విడత: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి మండలాల్లో 3242 కేంద్రాలు
నేడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేయనుంది. ఈ రెండు స్థానాలకు ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 60వార్డుల్లో మొత్తం 1,57,545 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 77,535 మంది, మహిళలు 79,985 మంది, ఇతరులు 25 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,450 మంది అధికంగా ఉన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో 33,066 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 16,035 మంది, మహిళలు 17,020 మంది, ఇతరులు 11 మంది. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు 985 మంది ఎక్కువగా ఉన్నారు.