Share News

సేవల్లో రెడ్‌క్రాస్‌కు బంగారు పతకం

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:09 AM

Gold medal for Red Cross ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వహించే మానవతా సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం చేసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు అరుదైన గౌరవం లభించింది.

సేవల్లో రెడ్‌క్రాస్‌కు బంగారు పతకం
కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు బంగారు పతకాన్ని బహూకరిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

గవర్నర్‌ చేతుల మీదుగా అందుకున్న కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వహించే మానవతా సేవా కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా శాఖ అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం చేసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన రెడ్‌క్రాస్‌ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌, ఐఆర్‌సీఎస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ‘గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌’ అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, విపత్తు నిర్వహణలో శిక్షణ, ఆరోగ్య అవగాహనా సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మారుమూల గ్రామాలకు కూడా రెడ్‌క్రాస్‌ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పర్యవేక్షణలో యూత్‌ రెడ్‌క్రాస్‌, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్‌ వలంటీర్లు, ప్రతినిధులు, రక్తదాతల సమిష్టి కృషితోనే ఈ పురస్కారం లభించిందన్నారు. కార్యక్రమంలో జేసీ తరపున జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు ఈ అవార్డును స్వీకరించగా, ఐఆర్‌సీఎస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు కనుగుల దుర్గా శ్రీనివాస్‌, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, నూక సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, జి.రమణ, పి.చైతన్యకుమార్‌, పి.రాజేష్‌, ఉమ, మాధవకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:09 AM