బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని...
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:37 PM
ఓ వైపు డాగ్‌స్క్వాడ్...మరోవైపు క్లూస్ టీమ్ రంగంలోకి దిగాయి. నేరస్థుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పడ్డాయి.
హిరమండలంలో హైడ్రామా
హిరమండలం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు డాగ్‌స్క్వాడ్...మరోవైపు క్లూస్ టీమ్ రంగంలోకి దిగాయి. నేరస్థుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పడ్డాయి. అంతకుముందే అక్కడికి వచ్చిన పోలీసులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో పోలీసు జాగిలాలు ఓ వ్యక్తి దగ్గర నిలిచిపోయాయి. సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో నివాసం ఉంటున్న అంధవరపు కస్తూరిబాయి ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి వస్తువులు దోచుకుపోయారంటూ స్థానిక పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందింది. వెంటనే ఎస్‌ఐ వై.మధుసూదన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి వద్ద ఉన్న కస్తూరిబాయి కుమారుడు సురేష్ దొంగతనం జరిగిన తీరును ఎస్‌ఐకి వివరించాడు. తన తల్లి, అన్నయ్య, కుమార్తె ఇంట్లో ఉంటున్నారని చెప్పాడు. ముగ్గురూ పోలాకిలోని బంధువుల ఇంటికి వెళ్లారని తెలిపాడు. భార్యతో కలిసి తాను అదే వీధిలో వేరొక ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు. ఉదయాన్నే తన తల్లి ఇంటికి వచ్చి చూడగా తలుపు తెరిచి ఉందని...లోపలి గదిలో ఉన్న బీరువా తాళాలు తీసి ఉన్నాయని వివరించాడు. అందులో బంగారు ఆభరణాలు దోచుకుపోయారని చెప్పాడు. వెంటనే ఎస్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకటేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీమ్‌ను రప్పించారు. క్లూస్ టీం సభ్యులు ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఇంటి చుట్టుపక్కల పరిశీలించారు. పొలాకి నుంచి వచ్చిన కస్తూరిబాయి నుంచి వివరాలు సేకరించారు. ఇంటి తాళం చెవి తనవద్దనే ఉందని ఆమె చెప్పింది. పోలీసులు తీసుకువచ్చిన జాగిలం కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి వద్ద ఆగిపోయింది. దీంతో దొంగతనం కేసుపై పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంటి ప్రధాన తలుపునకు నిప్పు పెట్టి.. తాళం పగులగొట్టి ఉంది. ముందు ఉన్న గజాల తలుపు తాళం తీసి ఉంది. ఆభరణాలు ఉన్న బీరువా తాళాలు అదే ఇంట్లో కూస్తూరిబాయి కప్ బోర్డులో దాచిపెట్టి... తాళం చెవిని తనతో తీసుకుపోయింది. ఆభరణాలు ఉన్న బీరువా తాళాలు తీసుకునేందుకు దొంగ కప్‌బోర్డు పగుల కొట్టకుండా తాళం చెవిని ఉపయోగించడం వంటి అంశాలను పోలీసులు గుర్తించారు. ఇది ఇంటి దొంగ పనేనని నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులను విచారించారు. అసలు విషయాన్ని బయట పెట్టారు.
కుమారుడి పనే..
కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కస్తూరిబాయి ఇంట్లో ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పారు. కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కుమారుడు సురేష్ తల్లిని బెదిరించేదుకు ఇంట్లో దొంగలు పడ్డారని నాటక మాడినట్టు తెలిపారు. ఆభరణాలను కస్తూరిబాయికి అప్పగించామని...లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.