బంగారం, వెండి.. దిగొస్తున్నాయ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:01 AM
Gold and silver prices are falling బంగారం, వెండి ధరలు గత పదిహేను రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సామాన్యులు ఊరట చెందగా.. వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు.
తగ్గుతున్న ధరలు
నెలరోజుల వ్యవధిలో గోల్డ్ పది గ్రాములపై రూ.20వేలు..
సిల్వర్ కిలోకు రూ.55వేల వరకూ తగ్గింపు
సామాన్యులకు ఊరట
డీలా పడుతున్న మదుపరులు
నరసన్నపేట, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బంగారం, వెండి ధరలు గత పదిహేను రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సామాన్యులు ఊరట చెందగా.. వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మే నెలలో కిలో వెండి గరిష్ఠంగా రూ.3.50 లక్షలకు చేరింది. భవిష్యత్‌లో మరింత పెరుగుతాయనే ఉద్దేశంతో ఉద్యోగులు, వ్యాపారులు వాటిపై పెట్టుబడి పెట్టారు. జిల్లాలో గత నెలలో దసరా పురస్కరించుకుని సుమారు రూ.300 కోట్ల వరకూ బంగారం, వెండి కొనుగోలు చేశారు. రియల్ఎస్టేట్ రంగం డీలా పడగా, స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మదుపరులు వెండి, బంగారంపై పెట్టుబడులపై ఆసక్తి చూపారు. డిమాండ్ పెరగడంతో గత నెల రికార్డుస్థాయిలో బంగారం, వెండి దిగుమతి చేసుకున్నామని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ధరల వ్యత్యాసం ఇలా..
దసరా నాటికి కిలో వెండి రూ.2.10లక్షలు ఉండగా.. శుక్రవారం నాటికి రూ.1.55 లక్షలకు చేరింది. బంగారం ధరలు కూడా గత పదిహేను రోజుల్లో 10 గ్రాములకు రూ.20వేల వరకు తగ్గింది. దసరా నాటికి పది గ్రాముల 24 క్యారట్స్ బంగారం ధర రూ.1.48 లక్షలు పలికింది. రోజుకు గ్రాముకు రూ.500 నుంచిరూ. 1200 వరకు హెచ్చు తగ్గుతూ.. శుక్రవారం రూ.2,500 వరకు భారీగా తగ్గింది. ప్రస్తుతం రూ.1.28 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధరలు తగ్గుముఖం పట్టడం.. డాలర్ మారకం విలువ పెరగడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూఎస్ఏలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ ధరలు తగ్గిస్తుందని ముందుగా భావించడంతో బంగారం, వెండిపై ముదుపరులు భారీగా పెట్టుబడులు పెట్టారు. కాగా ఇటీవల ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో వెండి, బంగారం ధరలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
నష్టాలబాటలో మదుపరులు
జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆమదాలవలస, సోంపేట తదితర పట్టణాల్లో వ్యాపారులు, ఉద్యోగులు గత నెలలో భారీగా బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టారు. ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు జిల్లాలో సుమారు రూ.200 కోట్ల విలువైన వెండి కొనుగోలు చేశారు. బంగారంపై మరో రూ.100 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. ఒక్కసారిగా వెండి ధరలు పతనం కావడంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు. ఽధర మరింత పతనం అవుతుందనే ఉద్దేశంతో తమ వద్ద ఉన్న వెండిని విక్రయించేందుకు షాపులు వద్దకు వెళ్తున్నారు. అయితే అంత మొత్తాలు ఇప్పుడు ఇవ్వలేమని.. కొద్దిరోజులు సమయం కావాలని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొందరు గత్యంతరం లేక విక్రయిస్తున్నారు. మరికొందరు భవిష్యత్‌లో ధర పెరుగుతుందనే ఆశతో ఉన్నారు.
ఊహించలేదు
బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఊహించలేదు. భవిష్యత్‌లో పిల్లలు చదువు కోసం వెండి మీద పెట్టుబడి పెట్టాం. ఒక్కసారిగా ధరలు తగ్గుతున్నాయి. నష్టమో.. లాభమో కొంత వెండి విక్రయించి.. మరికొంత భవిష్యత్ కోసం దాచుకుంటున్నాం. బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టడం కొంతవరకు పెట్టుబడుదారులకు నష్టమే.
- ఆర్.శ్రీనివాసరావు, ఉద్యోగి, శ్రీకాకుళం
వ్యాపారాలు పెరుగుతున్నాయి.
వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొందరు భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. బంగారం మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంది. పదిహేను రోజుల్లో 10 గ్రామలకు రూ.20 వేల వరకు బంగారం ధరలు తగ్గాయి. వెండి కిలోకు రూ.80వేల వరకు ధర తగ్గింది. ధరలు తగ్గడంతో.. ప్రస్తుతం చాలామంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
- గుడ్ల నాగరాజు, బంగారం వ్యాపారి, నరసన్నపేట