Share News

మామూళ్ల ప్లానింగ్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:24 AM

సొంతిల్లు కట్టుకోవడం సంగతెలా ఉన్నా.. ప్లానింగ్‌ అప్రూవల్‌ కావాలంటే ఎన్ని తిప్పలో. ముందుగా టౌన్‌ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అంతటితే సరిపోదు.

 మామూళ్ల ప్లానింగ్‌

-డబ్బులిస్తే అప్రూవల్‌.. లేదంటే ఫైల్‌ పెండింగ్‌

-శ్రీకాకుళం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తీరు

-ఏసీబీ సోదాల్లో సిబ్బంది వద్ద పట్టుబడిన లెక్కల్లోకిరాని నగదు

-ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌, భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు

-నెలల తరబడి మగ్గుతున్న సామాన్యుల దరఖాస్తులు

-నిర్వహణకు నోచుకోని వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ వంటి రిజిస్టర్లు

శ్రీకాకుళం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సొంతిల్లు కట్టుకోవడం సంగతెలా ఉన్నా.. ప్లానింగ్‌ అప్రూవల్‌ కావాలంటే ఎన్ని తిప్పలో. ముందుగా టౌన్‌ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అంతటితే సరిపోదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అయినా పని కాదు. వారు అడిగిన మొత్తం ఇస్తే ఇట్టే అప్రూవల్‌ అయిపోతుంది. శ్రీకాకుళం నగరపాలక కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అవినీతి వేళ్లూనుకుని పోయింది. మంగశారం ఏసీబీ అధికారులు ఈ విభాగంలో తనిఖీలు చేయడం కలకలం రేపింది.

సామాన్యులకు చుక్కలే

నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఫైళ్లు కదలడం లేదు. నిర్ణయం తీసుకోకుండా దరఖాస్తులను సిబ్బంది కావాలనే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పెడుతున్నారు. అడిగినంత ఇచ్చుకోకపోతే ఏవేవో తప్పులు వెతికి ఫైలును పక్కన పడేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

అస్తవ్యస్తంగా రికార్డులు..

భవన నిర్మాణ ప్లాన్ల ఆమోదంతో పాటు, లేఅవుట్‌ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌), భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) స్కీమ్‌ల ఆమోదంలో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదే వియాన్ని ఏసీబీ కూడా ఆధారాలతో గుర్తించింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. ఖాళీ స్థలాల పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌) వంటి తప్పనిసరి రిజిస్టర్లను కూడా సిబ్బంది నిర్వహించడం లేదని అధికారుల దాడుల్లో తేలింది.

పట్టుబడిన లెక్కల్లోకి రాని నగదు..

ఏసీబీ సోదాల్లో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది వద్ద లెక్కల్లోకి రాని నగదును ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మూలాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం కూడా సోదాలు పూర్తిచేసి.. టౌన్‌ ప్లానింగ్‌ అవినీతి చిట్టాను ఏసీబీ జారీచేయనుంది. ప్లాన్‌ అనుమతికి ఓ రేటు కట్టేసి వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ప్లాన్‌లో ఉన్న విధంగా.. క్షేత్రస్థాయిలో భవనాలు ఉండడంలేదు. పార్కింగ్‌తోపాటు.. ఇతర నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు శూన్యం.

ఇలా చేస్తేనే అవినీతికి చెక్‌..

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఫైళ్ల కదలికపై ఉన్నతాధికారుల నిరంతరం ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించాలి. సిటిజన్‌ చార్టర్‌ను కచ్చితంగా అమలు చేసి, గడువులోగా దరఖాస్తులను ఆమోదించడం లేదా తిరస్కరించడం (కారణాలతో సహా) చేయాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు దశాబ్దంన్నర నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. అస్తవ్యస్తంగా డివిజన్లను విభజించారు. ఎన్నికలను జరపనీయకుండా ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను నాయకులే కారణమవుతున్నారు. ఇదే అదనుగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి హెచ్చుమీరింది. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్‌.. నెలకోమారు అయినా టౌన్‌ప్లానింగ్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించడం.. నగరప్రజలనుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి.. విశ్లేషణ చేస్తుంటే అవినీతికి చెక్‌ పడే అవకాశముంది.

Updated Date - Mar 11 , 2026 | 12:24 AM