కష్టాల గుది‘బండ’
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:07 AM
Problems due to shortage of gas cylinders జిల్లాలో ఎక్కడ చూసినా.. గ్యాస్ కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ బుకింగ్, డెలివరీకి సంబంధించి ఆయా కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కష్టాలు వెంటాడుతున్నాయి.
గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇక్కట్లు
హోటళ్లు, పాఠశాలల్లో కట్టెలపొయ్యిపైనే వంటలు
విద్యార్థుల మధ్యాహ్న భోజనానికీ తప్పని అవస్థలు
పాత శ్రీకాకుళం/ బూర్జ/ కాశీబుగ్గ/ టెక్కలి/వజ్రపుకొత్తూరు/ పలాస రూరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడ చూసినా.. గ్యాస్ కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ బుకింగ్, డెలివరీకి సంబంధించి ఆయా కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలాచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. శ్రీకాకుళంలోని పలు హోటళ్లలో కట్టెలపొయ్యిపైనే వంటకాలు తయారు చేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకులదీ అదే పరిస్థితి. గ్యాస్ కొరత కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని, సకాలంలో వంట తయారీ కష్టమవుతోందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వసతిగృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిలిండర్ల కొరత కారణంగా విద్యార్థులకు భోజనాల నిర్వహణ కష్టమవుతోంది. చాలాచోట్ల కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో వంట గ్యాస్ కొరత కారణంగా వంట చేయడానికి ఎండీఎం వర్కర్లు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూర్జ మండలం కురుంపేట, పాలవలస తదితర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వాపోతున్నారు. గోదాముల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
వినియోగదారుల నిరీక్షణ
గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినా సెల్‌కు ఓటీపీలు రావడంలేదు. ఓటీపీలు వచ్చిన తర్వాత కూడా గ్యాస్ కోసం వినియోగదారులు ఉదయం నుంచీ బారులు తీరుతున్నారు. కొన్నిచోట్ల బుక్‌చేసి 25 రోజులు దాటిని సిలిండర్లు ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఈక్రమంలో కొంతమంది మహిళలు కట్టెలపొయ్యిపైనే ఆధారపడి వంటలు చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టాలని వినియోగదారులు, నిర్వాహకులు కోరుతున్నారు.
పలాస- కాశీబుగ్గలోని భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద గురువారం పెద్దఎత్తున వినియోగదారులు సిలిండర్ల కోసం నిరసన చేపట్టారు. గోడౌన్ వద్ద వేకువజాము నుంచి పడిగాపులు కాస్తున్నా.. కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ చేసి రెండువారాలు దాటినా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం లేదని వాపోయారు. ఇలా అయితే తాము ఎలా బతికేదని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
పలాస మండలంలో గ్రామీణ ప్రాంత వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం తాళభద్రలో గోడౌన్ వద్దకు అధిక సంఖ్యలో వినియోగదారులు తరలివచ్చారు. తాము వారం రోజులుగా గ్యాస్ కోసం తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. గోడౌన్ వద్ద ‘ఇక్కడ గ్యాస్ అందివ్వబడదు’ అనే బోర్డు చూసి.. కొంతమంది నిరాశతో వెనుదిరిగారు. వీఆర్వోలు భీమారావు, ఎర్రయ్య గొడౌన్ వద్దకు చేరుకుని.. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్ద సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు.
టెక్కలిలో కూడా గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం వినియోగదారులు బారులుదీరారు. సిలిండర్ బుక్ చేసినా.. సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాల ద్వారా సిలిండర్లు సరఫరా చేయకపోవడంతో ఏజెన్సీ వద్దకు వచ్చి.. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు.
వజ్రపుకొత్తూరులోనూ ఇదే పరిస్థితి. ఉద్దానం ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా నిర్వహించడం లేదు. గ్యాస్ ఎప్పుడు ఇస్తారని ఫోన్‌లో సిబ్బందిని సంప్రదించగా.. మీరే ఏజెన్సీ వద్దకు రావాలంటూ సమాధానమిస్తున్నారని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీటీ రామారావు వద్ద ప్రస్తావించగా.. గ్యాస్ సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సమస్య ఏర్పడుతోందన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు.