Share News

Gas problems: గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:22 AM

Gas problems: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. పరోక్షంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై పడింది.

Gas problems: గ్యాస్‌ కష్టాలు
నరసన్నపేటలోని ఒక హోటల్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న దృశ్యం

-పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు

-వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు

-హోటళ్లలో కట్టెలపొయ్యిపై వంటకాలు..

-నిర్వహణ భారమై.. మూతపడుతున్న వీధి దుకాణాలు

నరసన్నపేట/టెక్కలిరూరల్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం ప్రభావం.. పరోక్షంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై పడింది. గ్యాస్‌ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్‌ నిర్వాహకులకు గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈనేపథ్యంలో గ్యాస్‌ కష్టాల నుంచి గట్టేక్కెందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ.. హోటళ్ల నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాతపద్ధతిలో ఊకపొయ్యిలను వినియోగిస్తున్నారు. కట్టెలు, ఊక సక్రమంగా దొరక్క హోటళ్ల నిర్వహణ కష్టమవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఐదువేలకుపైగా హోటళ్లు ఉన్నాయి. వీటితోపాటు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హోటల్స్‌లో గృహావసర గ్యాస్‌ సిలిండర్ల (డొమస్టిక్‌) వినియోగం లేకుండా అధికారులు ముమ్మరదాడులు చేస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో అనేక ప్రాంతాల్లో చిన్నచిన్న హోటళ్లు మూతపడ్డాయి. నరసన్నపేట, శ్రీకాకుళం, పలాస తదితర పట్టణాల్లో పేరున్న రెస్టారెంట్లు కూడా రోజు తప్పించి రోజు తెరుస్తున్నారు. మరికొందరు కట్టెలు పొయ్యిలను వినియోగిస్తున్నారు. వివాహాలతో పాటు శుభకార్యాల సీజన్‌ కావడంతో గ్యాస్‌ కొరతతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మరికొద్దిరోజుల పాటు యద్ధం కొనసాగి గ్యాస్‌ సరఫరా మరింత కష్టమైతే మాత్రం హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల మూతవేయడం తప్పదని చెబుతున్నారు.

గృహసరాలకూ అంతే..

గృహసర వినియోగదారులకు కూడా గ్యాస్‌ సిలిండర్లు సకాలంలో సరఫరా కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో బుక్‌ చేసుకున్న రెండు రోజులకే సిలిండర్‌ అందజేసేవారు. ప్రస్తుతం కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. దీంతో పట్టణాల్లో 25 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత గ్యాస్‌ బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడే కట్టెలు, బొగ్గు ఆధారిత పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. కరెంట్‌ స్టౌలనూ విరివిగా వాడుతున్నారు.

కలపకు డిమాండ్‌

గ్యాస్‌ కొరతతో వంట కలపకు డిమాండ్‌ ఏర్పడింది. వాటి ధర కూడా అమాంతం పెరిగింది. గతంలో వంట కలప క్వింటా రూ.200 నుంచి రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.500 వరకు చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వంట చెరకును దిగుమతి చేసుకుంటున్నారు. కాగా పట్టణాల్లో వంట కలప కొరత కారణంగా కూడా కొన్ని హోటళ్లు మూతపడుతుండడంతో కార్మికులకు ఉపాధి కరువవుతోంది.

Updated Date - Mar 19 , 2026 | 12:22 AM