Share News

చెత్త నుంచి సంపద!

ABN , Publish Date - May 13 , 2026 | 12:12 AM

Waste management with technology పచ్చదనం, పరిశుభ్రతతోపాటు.. పర్యావరణానికి అనుకూలంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు ప్రజలకు సురక్షిత తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించేలా సాంకేతిక పరిజ్ఞానం వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది.

చెత్త నుంచి సంపద!
ఇంగిలిగాం గ్రామం వద్ద డంపింగ్‌ యార్డులో వ్యర్థాల నిర్వహణ

  • సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ

  • మునిసిపాలిటీల్లో అమలుకు సన్నాహాలు

  • జిల్లాలో సర్వేబృందాల పరిశీలన

  • పలాస, మే 12(ఆంధ్రజ్యోతి): పచ్చదనం, పరిశుభ్రతతోపాటు.. పర్యావరణానికి అనుకూలంగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు ప్రజలకు సురక్షిత తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించేలా సాంకేతిక పరిజ్ఞానం వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది. తద్వారా చెత్త నుంచి సంపద సృష్టించేలా.. రాష్ట్రంలో 46 మునిసిపాలిటీలను మోడల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేయనుంది. స్వచ్ఛసర్వేక్షన్‌ కార్యక్రమంలో ర్యాంకులు వచ్చే విధంగా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే సంబంధిత సర్వేబృందాలు అన్నీ మునిసిపాలిటీల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణపై సమగ్ర విచారణ చేస్తున్నాయి. ఆ బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కార్యక్రమానికి మునిసిపాలిటీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చెత్తనుంచి సంపద కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

  • ఉదాహరణకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో మొత్తం 11 ఎకరాలకుపైగా డంపింగ్‌ యార్డు ఉంది. ఇక్కడ ప్రతిరోజు 22 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంపింగ్‌యార్డులో కుళ్లబెట్టి కాల్చివేయడం తప్ప.. దాని నుంచి మునిసిపాలిటీ ఎటువంటి ఆదాయం పొందలేకపోతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఇటీవల రూ.3.50 కోట్లతో చెత్త సంపద కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తడి-పొడి చెత్తలను వేరు చేయడం, వాటినుంచి వర్మీకంపోస్టు, ఇతర అవసరాలకు వినియోగపడే ఉత్పత్తులు తయారు చేయడం దీని లక్ష్యం. ఈ విధంగా అన్నీ మునిసిపాలిటీల్లో కూడా చెత్త నుంచి సంపదతోపాటు పర్యావరణానికి విఘాతం లేకుండా పారిశుధ్య నిర్వహణ, ఘన, ద్రవ పదార్థాలు నిర్వహణకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి వాటి నుంచి కూడా సంపద సృష్టించనున్నారు.

  • జూన్‌ 15వ తేదీ నాటికి భారీస్థాయిలో ఉన్న చెత్తను ఉత్పత్తిచేసి వాటిని పోర్టరులో రిజిస్ట్రర్‌ చేయించడం, స్వయంసహాయక సంఘాలు, స్థానిక వ్యాపారుల ద్వారా వాటిని మార్కెట్‌లో విక్రయించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా చెత్త నిర్వహణ కేంద్రాలకు అనుసంధానం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని మునిసిపాలిటీలకు ఆదేశించింది. జాతీయస్థాయిలో ర్యాంకులు లక్ష్యంగా సత్తా ఉన్న 46 మునిసిపాలిటీలను ఎంపిక చేసి వాటికి ప్రత్యేక బృందాలకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం పక్కాగా అమలైతే.. మునిసిపాలిటీలకు అదనపు ఆదాయం సమకూరనుంది. మరోవైపు పట్టణాలు సుందరీకరణంగా మారి స్వచ్ఛమైన గాలి, నీరు లభించే అవకాశం ఉంది.

  • అపార్ట్‌మెంట్లు, ఫంక్షన్‌ హాళ్లల్లో కూడా..

  • జనావాసాలకు అనుగుణంగా పెరుగుతున్న అపార్ట్‌మెంట్లు, ఫంక్షన్‌ హాళ్లలో కూడా చెత్త సంపద కేంద్రాలు నిర్వహించి వాటి ద్వారా కూడా దాయం పొందే దిశగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ఆవరణలో చెత్తను కంపోస్టుగా మార్చే బయో డైజెస్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తక్కువ ధరకే సంబంధిత యంత్రాలు అందిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే జిల్లాలోని ఫంక్షన్‌ హాళ్లు, అపార్టుమెంట్ల సంఖ్యను గుర్తించడానికి టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందికి ఆదేశాలు అందాయి.

  • అవగాహన కల్పిస్తున్నాం

  • చెత్త నుంచి సంపద సృష్టించేలా చర్యలు ప్రారంభించాం. 11 ఎకరాల డంపింగ్‌ యార్డులో నిర్వహణ యూనిట్లు నిర్మిస్తున్నాం. వ్యర్థాల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీంతోపాటు పచ్చదనం, పారిశుధ్యం, శుద్ధ జలాల నిర్వహణకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

  • ఇ.శ్రీనివాసులు, కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ

Updated Date - May 13 , 2026 | 12:12 AM