మరింత ఆలస్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:25 AM
Incomplete ‘work adjustment’ process పాఠశాలలు పునఃప్రారంభమైన కొద్దిరోజుల్లోనే విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రైవేటు పాఠశాలల్లో తొలగించని విద్యార్థుల పేర్లతో తంటాలు
ప్రభుత్వ బడుల్లో నమోదుకు ఇబ్బందులు
షెడ్యూల్ మేరకు పూర్తికాని ‘వర్క్ అడ్జస్ట్‌మెంట్’ ప్రక్రియ
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూన్ 29(ఆంధ్రజ్యోతి):
పక్క జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాల నుంచి నరసన్నపేట మండలం రావులవలసలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 12న ఒక విద్యార్థి చేరాడు. ప్రభుత్వ పాఠశాలలో పేరు చేర్పించాలని.. కావున ప్రైవేటు పాఠశాల నుంచి పేరు తొలగించాలని విద్యార్థి తల్లిదండ్రులు రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఇంతవరకూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థి పేరు తొలగించలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ఆ విద్యార్థి పేరు నమోదు కావడం లేదు. జిల్లాలో ఇలా వందలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినా.. పేర్లు నమోదుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆటంకం ఏర్పడింది.
..................
పాఠశాలలు పునఃప్రారంభమైన కొద్దిరోజుల్లోనే విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా అడ్మిషన్లు పూర్తయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రాతిపదికన సర్‌ప్లస్, అవసరం ఉన్న టీచర్ల జాబితాలను సిద్ధం చేసి తాత్కాలిక పద్ధతుల్లో నియమకాలు చేపడుతుండేవారు. ఈ ఏడాది జూన్ 20 నాటికి పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే అక్కడ పనిచేసే జూనియర్ ఉపాధ్యాయులను మరో పాఠశాలకు బదలాయించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 27న మండలస్థాయిలో, 28న డివిజన్‌స్థాయిలో, 30న జిల్లాస్థాయిలో సర్దుబాటు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
కాగా.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పలువురు విద్యార్థులు చేరారు. ఆయా విద్యార్థుల పేర్లను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తొలగించడంలో తాత్సారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదుకావడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా చేపట్టే.. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ‘దీనిపై స్పష్టత లేక ఉపాధ్యాయులు గందరగోళంలో ఉన్నారు. విద్యాశాఖాధికారులు పునరాలోచించి కనీసం జూలై మొదటి వారంలోనైనా వర్క్ అడ్జస్ట్‌మెంట్‌కు కటాఫ్ డేట్‌గా తీసుకోవాలి. ఏ యాజమాన్యంలోని టీచర్ అదే యాజమాన్యానికి సర్దుబాటు చేయాలి. ఎంఈవో పోస్టులు ఖాళీ ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎస్‌ఏలను ఎఫ్‌ఏసీ హోదాలో ఎంఈవోలుగా నియమించాల’ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందిగ్ధం నెలకొంది.