రైల్వేకు నిధుల వరద
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:06 AM
Naupada-Gunupur railway line expansion రైల్వేపరంగా జిల్లా ఇక శరవేగంగా అభివృద్ధి చెందనుంది. జిల్లావాసుల దశాబ్దాల నాటి కలలు సాకారం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల’ (ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాగ్రెస్)పై విడుదల చేసిన తాజా నివేదిక సిక్కోలు వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
నౌపడా-గుణుపూర్ రైల్వే లైన్ విస్తరణకు రూ.935 కోట్లు
జిల్లా మీదుగా వెళ్లే ‘మూడో లైన్’కు రూ. 4,962 కోట్లు
కేంద్ర రైల్వేశాఖ తాజా నివేదికలో వెల్లడి
ఎట్టకేలకు ఫలించిన దశాబ్దాల కల
రవాణా ముఖచిత్రం మారేలా భారీ ప్రాజెక్టులు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రైల్వేపరంగా జిల్లా ఇక శరవేగంగా అభివృద్ధి చెందనుంది. జిల్లావాసుల దశాబ్దాల నాటి కలలు సాకారం కానున్నాయి. కేంద్ర రైల్వేశాఖ ‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల’ (ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాగ్రెస్)పై విడుదల చేసిన తాజా నివేదిక సిక్కోలు వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. జిల్లాకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నౌపడా లైన్ విస్తరణతో పాటు, జిల్లా మీదుగా వెళ్లే ప్రధాన రైలు మార్గంలో మూడో లైన్ నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా రవాణా, వాణిజ్య ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది.
నౌపడా జంక్షన్‌కు మహర్దశ..
జిల్లాలోని టెక్కలి డివిజన్‌లో కీలకమైన నౌపడా రైల్వే జంక్షన్ రూపురేఖలు మారనున్నాయి. ఒడిశా సరిహద్దులను కలుపుతూ సాగే ‘నౌపడా - గుణుపూర్’ లైన్‌ను ఒడిశాలోని తేరుబలి వరకు పొడిగించే ప్రాజెక్టుకు లైన్‌క్లియర్ అయింది. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ ఏకంగా రూ.935.72 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. నౌపడా నుంచి గుణుపూర్ మీదుగా తేరుబలి వరకు సుమారు 79.15 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మాణం జరగనుంది. 2023-24లో మంజూరైన ఈ ప్రాజెక్టు పూర్తయితే.. జిల్లా నుంచి ఒడిశాలోని రాయగడ, ఇతర గిరిజన ప్రాంతాలకు నేరుగా రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. వాణిజ్యపరంగా జిల్లాకు ఎంతో లబ్ధి చేకూర్చనుంది.
‘మూడో లైన్’ సందడి..
జిల్లా రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైన మరో ప్రాజెక్టు ‘విజయనగరం-భద్రక్’ మూడోలైన్ (థర్డ్ లైన్). చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో ఉన్న మన జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా మూడో లైన్ నిర్మాణం జరగనుంది. 525 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మూడో లైన్ కోసం రూ. 4962.87 కోట్లు కేటాయించారు. పేరుకు విజయనగరం - భద్రక్ అయినప్పటికీ.. ఈ లైన్ సింహభాగం శ్రీకాకుళం జిల్లా మీదుగానే వెళ్తుంది. చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస), పలాస, ఇచ్ఛాపురం వరకు ఈ పనులు జరుగుతాయి. ప్రస్తుతం ఈ రూట్‌లో గూడ్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దీ విపరీతంగా ఉంది. మూడో లైన్ పూర్తయితే ప్యాసింజర్ రైళ్లకు, సరుకు రవాణాకు ప్రత్యేక మార్గాలు ఏర్పడి ప్రయాణం సాఫీగా సాగుతుంది. కొత్త రైళ్లు జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో...
ఈ రెండు భారీ ప్రాజెక్టులు ఈస్ట్ కోస్ట్ రైల్వే పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా, రవాణా పరంగా పొరుగున ఉన్న విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పోటీపడే స్థాయికి ఎదుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.