విలేజ్ క్లినిక్‌లకు నిధులు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:27 PM
జిల్లాలో సగంలో నిలిచిపోయిన విలేజ్ క్లినిక్ భవనాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
- పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు
- 284 భవనాలకు రూ.49 కోట్లు మంజూరు
- టెక్కలి మండలంలోని మొఖలింగపురం, నరసింగపల్లి పంచాయతీలకు సంబంధించి నరసింగపల్లి సచివాలయం పరిధిలో విలేజ్ క్లినిక్ నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం రూ.16 లక్షలు కేటాయించింది. ఐదేళ్ల పాలనలో కేవలం పునాదులు(పిల్లర్లు) వేసి వదిలేశారు. భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో నరసింగపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని విలేజ్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు.
-మెళియాపుట్టి మండలం వెంకటాపురం, కొత్తూరు గిరిజన పంచాయతీ ప్రజలకు వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం విలేజ్ క్లినిక్‌ను మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణం కోసం రామచంద్రపురం వద్ద స్థలం గుర్తించింది. కానీ, ఆ భవనం పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది. బందపల్లి గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని విలేజ్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు.
టెక్కలిరూరల్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సగంలో నిలిచిపోయిన విలేజ్ క్లినిక్ భవనాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు భారీగా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలో 535 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణానికి రూ.16లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసింది. అయితే ఈ పనులను కొంత మంది వైసీపీ నాయకులకు అప్పగించింది. దీంతో పనులు చేయకుండానే కొంతమంది బిల్లులు చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా కొంతమంది కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవటంతో వారు పనులను సగంలోనే వదిలేశారు. మొత్తం 535 విలేజ్ క్లినిక్‌లకు గాను ఇప్పటివరకు కేవలం 147 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. వీటికోసం రూ.54.72 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇంకా 388 భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విలేజ్ క్లినిక్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లాలో నిలిచిపోయిన 388 భవనాలకు గాను 284 భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.49 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని భవనాల పనులు చేస్తుండగా, మరి కొన్నింటికి టెండర్లు పిలుస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రానున్న కాలంలో మిగతా 104 భవనాలకు కూడా నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కేంద్రంలో జనరల్ ఓపీ, ఈఎన్‌టీ, సుగర్, బీపీ వంటి 14 రకాల వ్యాధులకు వైద్య సేవలందిస్తారు. గర్భిణుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది శ్రద్ధచూపుతారు. ఈ కేంద్రాల్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశ, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు.
పనులు పూర్తి చేస్తాం
గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్ భవనాలు సగంలో నిలిపోయాయి. ఆ పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొన్ని భవనాలకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం (ఎన్‌హెచ్‌ఎం) నేషనల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా నిధులు మంజూరు చేశాయి. పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
-ఆనందరావు, మండల ఇంజనీరింగ్ అధికారి, మెళియాపుట్టి