Share News

‘బాహుదా’కు నిధుల వరద

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:52 PM

Government sanctions Rs 1.10 crore బాహుదా నదిపై కూటమి ప్రభుత్వం కరుణ చూపింది. అభివృద్ధి పనులకు సోమవారం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. బెల్లుపడ వరద గట్టు నిర్మాణానికి రూ.70 లక్షలు, బెల్లుపడ, లొద్దపుట్టి గ్రోయిన్ల నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయించింది.

‘బాహుదా’కు నిధుల వరద
బాహుదా నది

  • రూ.1.10 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

  • బెల్లుపడ వరద గట్టుకు రూ.70 లక్షలు

  • గ్రోయిన్ల మరమ్మతులకు రూ.40 లక్షలు

  • ఇచ్ఛాపురం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి):

  • బాహుదా నదిపై కూటమి ప్రభుత్వం కరుణ చూపింది. అభివృద్ధి పనులకు సోమవారం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. బెల్లుపడ వరద గట్టు నిర్మాణానికి రూ.70 లక్షలు, బెల్లుపడ, లొద్దపుట్టి గ్రోయిన్ల నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయించింది. గత ఏడాది ఇంజనీరింగ్‌ అధికారుల బృందం.. నదీ జలాల పరిరక్షణపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ సంబంధితశాఖ మంత్రులు, ఉన్నతాధికారులకు బాహుదా సమస్య విన్నవించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.

  • సాగు.. తాగునీటికి ఇదే ఆధారం

  • బాహుదా నది.. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ప్రధాన నీటి వనరు. ఒడిశాలో పుట్టిన బాహుదా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నది ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇచ్ఛాపురం పట్టణంతోపాటు మరో 30 గ్రామాలకు తాగునీటి ప్రధాన ఆధారం కూడా బాహుదే. కానీ నదికి సంబంధించి సరైన నిర్వహణ లేదు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, గత పాలకుల తప్పిదాలు, నదిలో నీటి ప్రవాహం మార్పులు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్నింటికీ మించి ఒడిశా ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టుల కింద ప్రాంతంగా ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతోంది. ఒడిశా ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వాటన్నింటినీ దాటుకొని కింది ప్రాంతాలకు నీరు రావడం గగనంగా మారింది. ఒడిశా భూభాగంలో ప్రాజెక్టులు కడుతున్నారు. కానీ మన భూభాగంలో 18 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 ఓపెన్‌హెడ్‌ చానెల్స్‌ను కనీసం మరమ్మతులు చేయలేకపోతున్నారు.

  • 2018లో తితలీ తుఫాన్‌ సమయంలో నదిలో బెల్లుపడ వైపు ఉన్న రక్షణ గోడ కూలిపోయింది. దీంతో వర్షకాలంలో వరద నీరు బెల్లుపడపై పోటెత్తుతోంది. సమీప పొలాలు సైతం వరద ముంపులో చిక్కుకొని నష్టం కలుగుతోంది. వైసీపీ పాలనలో ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

  • 2024లో ఈ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ ద్వారా సమస్యను రైతులు విన్నవించారు. ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. కాగా వైసీపీ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. దీంతో తమకు సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • త్వరగా పనులు..

  • ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న బెల్లుపడ, లొద్దపుట్టి గ్రామాల ప్రజల చిరకాల కోరిక తీరనుంది. బాహుదా అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.10కోట్లు మంజూరు చేసింది. ఓ అండ్‌ ఎం(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) నిధులతో బెల్లుపడ వరదగట్టు నిర్మాణానికి రూ.70 లక్షలు, బెల్లుపడ, లొద్దపుట్టి గ్రోయిన్ల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించాం.

    - డాక్టర్‌ బెందాళం అశోక్‌బాబు, ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం

Updated Date - Jun 23 , 2026 | 11:52 PM