ఉద్దానం టు విదేశాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:23 AM
Youth getting deceived while seeking jobs స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వంటి కారణాలతో చాలామంది యువత విదేశీ బాట పడుతుంటారు. ప్రధానంగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందిన యువత అధికంగా విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని వీసా ఏజెంట్లు రెచ్చిపోతున్నారు.
ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోతున్న యువత
టూరిస్ట్ వీసాలతో పంపిస్తున్న ఏజెంట్లు
అదుపులోకి తీసుకుంటున్న అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు
లబోదిబోమంటున్న తల్లిదండ్రులు
సోంపేట రూరల్/వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీ అనే యువకుడు భీమవరం ఏజెంట్ సాయంతో గతనెల 12న మలేషియాకు వెళ్లాడు. వీసా గడువు ముగియకుండానే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే టూరిస్ట్ వీసా అని వారు చెప్పారు. కుమారుడు సాయివంశీని రప్పించే ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ను తండ్రి పాపారావు ఆదివారం విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఎమ్మెల్యే మాట్లాడి తక్షణమే సాయివంశీతోపాటు మిగతా యువకులు స్వదేశానికి చేరుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వంటి కారణాలతో చాలామంది యువత విదేశీ బాట పడుతుంటారు. ప్రధానంగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందిన యువత అధికంగా విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని వీసా ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి, నకిలీ వీసాలతో విమానం ఎక్కిస్తున్నారు. ఎన్నో కలలతో పరదేశంలో అడుగుపెట్టడానే పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఉపాధి కోసం వెళ్లిన యువత విదేశాల్లో చిక్కుకుపోతున్నారు. నకిలీ వీసాల కారణంగా వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో స్వగ్రామాల్లోని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
మోసం ఇలా..
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని నిరుద్యోగ యువకులను గుర్తించి దుబాయ్, సౌదీ, మలేషియా, యూరప్‌లో భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మిస్తున్నారు. వీరికి వర్కింగ్ వీసాలు కాకుండా టూరిస్ట్ వీసాలు ఇచ్చి అక్కడకు పంపుతున్నారు. వీసా ప్రాసెసింగ్, మెడికల్, టికెట్ ఖర్చుల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బుల కోసం చాలా మంది తల్లిదండ్రులు పొలాలు అమ్ముతుండగా, మరికొందరు అప్పులు చేస్తున్నారు. అయితే, యువకులు విదేశాలకు చేరుకున్నాక వారివి టూరిస్ట్ వీసాలు అని తెలుసుకుంటున్నారు. దీంతో వీసా గడువు ముగియకుండానే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు.
వజ్రపుకొత్తూరులో అధికం..
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసానికి గురవుతున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన యువకులు ఎక్కువమంది ఉంటున్నారు. రెండేళ్ల కిందట బెహరన్ వెళ్లిన సుమారు 30 మంది యువకులు మోసానికి గురై అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువమంది వజ్రపుకొత్తూరు వాసులే. అప్పట్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు విదేశాంగ అధికారులతో మాట్లాడి వారిని ఇండియాకు తీసుకువచ్చారు. గత నెల మలేషియా వెళ్లిన వారిలో ఉద్దానం ప్రాంతానికి చెందిన 40 మందిని.. ఈ నెల 10న అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ మలేషియాకు పంపించడంలో మండలానికి చెందిన ఓ వ్యక్తే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యులు ఈ ఏజెంట్‌ను ప్రశ్నిస్తుంటే సరైన సమాధానం ఇవ్వడం లేదు. గతంలోనూ ఈయన అనేక మందిని విజిటింగ్ వీసాతోనే విదేశాలకు పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈశాన్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో తనిఖీలు అధికంగా ఉంటున్నాయి. దీంతో విజిటింగ్ వీసాతో వచ్చిన వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. మలేషియా అధికారుల అదుపులో ఉన్నవారిని ఇండియా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏజెంట్ల నుంచి సొమ్మును తిరిగి రాబట్టేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
పోలీసుల హెచ్చరిక..
‘లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఏజెంట్ లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి’ అని సోంపేట సీఐ మంగరాజు తెలిపారు.