ఒడిశా నుంచి తమిళనాడు
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:18 AM
Unstoppable marijuana transportation పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి రవాణా ఆగడం లేదు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా తమిళనాడు గంజాయి రవాణా సాగుతోంది. ఈక్రమంలో శనివారం జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆరుగురు వ్యక్తులు 17.25 కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు.
ఆగని గంజాయి రవాణా
జిల్లాలో వేర్వేరుచోట్ల 17.25 కేజీల నిల్వలు స్వాధీనం
ఆరుగురు అరెస్టు
నరసన్నపేట/ ఇచ్ఛాపురం/ ఆమదాలవలస, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి రవాణా ఆగడం లేదు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా తమిళనాడు గంజాయి రవాణా సాగుతోంది. ఈక్రమంలో శనివారం జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆరుగురు వ్యక్తులు 17.25 కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు శనివారం మడపాం టోల్‌ప్లాజా వద్ద నరసన్నపేట పోలీసులకు పట్టుబడినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.గణేష్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం.. ఈరోడ్ జిల్లా.. తిరుపూర్‌కు చెందిన అజిత్‌కుమార్, గోకుల్ శక్తివేల్ ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో 12.55 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో వస్తూ శుక్రవారం సాయంత్రం మడపాం టోల్‌ప్లాజా వద్దకు ఓ ప్రైవేట్ వాహనంలో చేరుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా.. వారిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. రెండు సెల్‌ఫోన్లు, 12.55 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అజిత్‌కుమార్ గతేడాది నవంబరు నుంచి ఒడిశా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి తిరుపూర్ తరలించి విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో పద్మచరణ్ దిగల్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో.. ఒడిశా నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తూ ఇద్దరు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన నాగరాజ్ మురుగన్, రాజీ ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి.. బస్సులో ఇచ్ఛాపురం చేరుకున్నారు. చెన్నై వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ ఎస్సై ముకుందరావు వాహనాలు తనిఖీలు చేస్తేన్నారు. అదే సమయంలో రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా నాగరాజ్ మురుగన్, రాజీ కనిపించారు. వారి బ్యాగులు తనిఖీ చేయగా.. 3.60 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ ఇద్దరినీ ఎస్‌ఐ ముకుందరావు అరెస్టు చేశారు. మేజిస్ర్టేల్ ఎదుట నిందితులను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.
ఆమదాలవలస పట్టణంలోని బీఆర్ నగర్ సమీపంలో రెండు కేజీల గంజాయితో ఇద్దరు పట్టుబడ్డారని ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. శనివారం బీఆర్‌నగర్‌లో తనిఖీలు చేయగా.. పట్టణానికి చెందిన సయ్యద్ తాహిర్, మన్యాల నరేష్ వద్ద రెండు కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. ఆ ఇద్దరినీ ఆమదాలవలస జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ ముందు హాజరుపర్చగా న్యాయాధికారి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.